హైదరాబాద్ నారాయణ గూడలో ఇద్దరు కాలేజీ విద్యార్థినులు అదృశ్యమయ్యారు. వైఎంసీఎ సమీపంలోని రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. కాలేజీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న చామంతి(18), దివ్య(20) అనే విద్యార్ధినిలు శనివారం నుండి కనిపించకుండా పోయారు. 

అయితే ఈ విషయం నిన్న కళాశాల యాజమాన్యం దృష్టికి రావడంతో వారు నారాయణ గూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థినులను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ప్రేమ వ్యవహారాలేమైనా ఈ మిస్సింగ్ కారణమై ఉంటాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. విద్యార్థినుల మిస్సింగ్ కేసును చేదించేందుకు హాస్టల్ ప్రాంతంలోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. అలాగే విద్యార్థినుల తల్లిదండ్రుల నుండి కూడా సమాచారం తీసుకుంటున్నారు. త్వరలో విద్యార్థినుల ఆచూకీ కనిపెడతామని పోలీసులు తెలిపారు.