అంబానీ ఇంట మరో పెళ్లి సందడి మొదలుకానుంది. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ముద్దుల కుమార్తె ఈశా అంబానీ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఇటీవల ముకేష్ అంబానీ కుమారుడు  ఆకాశ్ అంబానీ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఆకాశ్ వివాహం ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్‌ మెహతా కుమార్తె శ్లోక మెహతాతో ఈ ఏడాది డిసెంబర్ లో జరగనుంది. ఇటీవలే ఇరు కుటాంబాల సమక్షంలో వారి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కాగా.. తాజాగా ఈశా అంబానీ వివాహం కూడా నిశ్చయమైంది.

ఈశా అంబానీ దేశ దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన పిరమాల్‌ సంస్థల వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య 40 ఏళ్లుగా చక్కటి స్నేహబంధం కొనసాగుతోంది. ఈశా, ఆనంద్‌ల మధ్య కూడా గాఢమైన స్నేహం ఉంది. మహాబలేశ్వర్‌లోని ఓ ఆలయంలో ఆనంద్‌ తొలుత ఈశాతో పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఇందుకు ఈశా అంగీకరించారట. అనంతరం రెండు కుటుంబాల వారూ కలిసి విందు చేసుకున్నారు. 

ఆనంద్‌ తల్లిదండ్రులు స్వాతి, అజయ్‌ పిరమాల్‌, సోదరి నందిని, ఈశా తల్లిదండ్రులు నీతా, ముకేశ్‌ అంబానీ, నానమ్మ కోకిలాబెన్‌, అమ్మమ్మ పూర్ణిమా దలాల్‌, ఈశా కవల సోదరుడు ఆకాశ్‌ అంబానీ, తమ్ముడు అనంత్‌ అంబానీ తదితరులంతా ఎంతో ఆనందంగా ఈ విందుకార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని సమాచారం. 

ముకేశ్‌ అంబానీ ముద్దుల కుమార్తె ఈశా (26)ను వివాహం చేసుకోబోతున్న ఆనంద్‌ పిరమాల్‌ (33) అత్యంత సమర్ధుడైన యువ వ్యాపార వేత్తగా పేరుగాంచారు. ‘పిరమాల్‌ గ్రూప్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా ఆనంద్‌ వ్యవహరిస్తున్నారు. సంస్థ అభివృద్ధి, వ్యూహాత్మక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.  పిరమాల్‌ గ్రూప్‌లో చేరకముందు,  గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసదుపాయం అందించే ‘పిరమాల్‌ ఇ స్వస్థ్య’ కార్యక్రమాన్ని ఆనంద్‌ ప్రారంభించారు.

సామాన్యులకు, అందుబాటు ఛార్జీల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం ఈ సంస్థ లక్ష్యం. రోజుకు కనీసం 40వేల గ్రామీణులకు ఈ కార్యక్రమం కింద వైద్య చికిత్స లభిస్తోంది. ఆయన ప్రారంభించిన రెండో సంస్థ స్థిరాస్తి వ్యవహారాలు నిర్వహించే ‘పిరమాల్‌ రియాల్టీ’. దేశంలో అపార విశ్వాసాన్ని, ఆదరణను చూరగొంటోంది. ఇప్పుడీ రెండు సంస్థలు, ఆనంద్‌ కుటుంబ వ్యాపారమైన పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమయ్యాయి.