మోహన్ అంటే కార్టూనిస్తే కాదు, ఉద్యమాలనుంచి బయటపడ్డ ఒక తరం జర్నలిస్టులకు ఆయన అండ, దోమల్ గూడలోని వాళ్ళ ఇల్లు అడ్డా.

మోహన్ ఇక కనిపించడు. అతని అందమయిన నవ్వు కనిపించదు. మోహన్ తో కూర్చుంటే దొరికే సరదాలు, ఎత్తిపొడుపులు, కుచ్చుకుని రక్తం చిందించేంత వ్యంగ్యం ఇక కనిపించవు. ,కుంచెలను, కాయితాలను, చార్టులను, పాతపుస్తకాలను, మందుగ్లాస్ ను, మనుషుల్ని అందర్ని వదిలేసి వెళ్లిపోయాడు...మోహన్ పోతే పోనీవండి.అయితే, ఆయన ఉండే నెలవు మాయవుతుంది,అది బాధ. మోహన్ పిల్లల కోడి. ఉన్నట్లుండి కోడి మాయమయితే, కోడిపిల్లలేమవుతాయి. ఆయన వెంట తిరిగి, అపుడపుడు రెండు గుక్కలేసుకుని, రష్యన్ సినిమాలు-సాహిత్యం, ఉద్యమాలు, రివిజనిజమూ, బొమ్మలు, అర్ట్ హిస్టరీ. ఇలా ఎన్నింటి గురించో మాట్లాడటం నేర్చకున్నవాళ్లేమవుతారు. అంతా గందరగోళం... చిమ్మ చీకటి... 

మోహన్ ఉదయం పత్రికతో మెగా స్టార్ అయ్యాడు. జర్నలిజంలో ఎవరీకి లేనంత ఫాన్ ఫాలోయింగ్ ఉంది. నాలుగు ముక్కలు నేర్చుకోవడానికి, గీసిన గీతలు చూపడడానికి, బతుకు దెరువు వెదుక్కోవడానికి, బాధలు చెప్పకోవడానికి జర్నలిస్టులు క్యూ కడుతూ ఉంటారు మోహన్ ను చూసేందుకు. ఇపుడెట్లా...

1984 ఉదయం వచ్చినపుడు... ఉద్యమాలనుంచి బయటపడ్డ ఒక తరం జర్నలిస్టులకు ఆయన అండ, దోమల్ గూడలోని ఇల్లు అడ్డా. ఆయన మాట తీరు లో వశీకరణ శక్తి ఉంది. దాన్నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తెలుగు నాట బాలకవులు, బాల కార్టూనిస్టులంతా అపుడో,ఇపుడో ఎప్పుడో ఒకసారి మోహన్ తన గీత మీద నడిచేలా చేశాడు. మోహన్ గీచిన గీత దాటడం కూడా కష్టం. 

నాలాంటి ఎందరో జర్నలిస్టులకు మోహన్ చదవుటం నేర్పించాడు. ప్రపంచాన్ని చూడటమూ నేర్పించాడు. మోహన్ శక్తి బ్లాక్ హోల్ లాంటిది సమీపిస్తే, లాగేసుకుంటాడు.

మోహన్ చుట్టూ తిరిగిన వాళ్లలోనేనొకడిని. ఆరోజుల్లో మోహన్ తో ఉండటమే జర్నలిజం, మోహన్ తో మాట్లాడటమే జర్నలిజం. ఒక తరాన్ని శాసించినవ్యక్తి మోహన్. పేరుకు కార్టూన్లు గీసుకునే ఉద్యోగం గాని, ఆయన ఎక్కడ ఉన్నా ఎడిటర్ కంటే ఇన్ ఫ్లుయెన్సియల్.


కొంతకాలంగా అన్నారోగ్యం తో బాధ పడుతున్నాడు. మొన్కొక రోజు, ఆసుపత్రిలో తుదిశ్వాసవడిచాడన్నారు. తర్వాత- లేదు,కోలుకుంటున్నాడన్నారు. హమ్మయ్య అనుకున్నాం.సెప్టెంబర్ 15 సాయంత్రం 6.28 కే ఆ వార్త వచ్చింది , కొన్ని ఛానల్స్ పరిగెత్తుకుంటూ స్క్రొలింగ్ వేశాయి. కొందరు మిత్రులు ఫేసుబుక్కు పోస్టింగ్స్ పెట్టారు. దీంతో అంతా కలవరం. అంతలోనే సవరణ.

ఇపుడు ఉన్నట్లుండి అదే వార్త.. సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 1.10 కి తుది శ్వాస. డాక్టర్ల నిర్ధారణ అంటూ. అయినా మరొక్క సారి కరెక్షనొస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నాను. నా వార్తని నేను ఖండించుకుంటా. సిగ్గేమీ లేదు. చెంపలేసుకుంటా.

1951 డిసెంబర్ 24 న ఏలూరు లో పుట్టాడట.1970 లో విశాలాంధ్ర లో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితం ప్రారంభించి ఇంత దాకా సాగుతూ వచ్చాడు. ఇలా వెళ్లిపోయాడు.

జై మోహన్.