యనమలపై రెచ్చిపోయిన శమంతకమణి

First Published 23, Nov 2017, 4:56 PM IST
mlc samanthakamani fire on minister yanamala ramakrishnudu
Highlights
  • యనమలను నిలదీసిన శమంతకమణి
  • మా ఇంట్లో శుభకార్యానికి ఎవరూ రాకూడదా అని ప్రశ్నించిన శమంతకమణి
  • నోరు విప్పని మంత్రి యనమల

ఏపీ ఆర్థిక శాఖా మంత్రి యనమలను మహిళా ఎమ్మెల్సీ శమంతకమణి నిలదీశారు. అసెంబ్లీ లాబీలో ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక యనమల బిక్కమొఖం వేశారు. అంతేకాదు.. ఆమెకు సమాధానం చెప్పకుండానే యనమల అక్కడి నుంచి తప్పించుకున్నారు. అసలు విషయం ఏమిటంటే..  బుధవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసిన తరువాత లాబీల్లో యనమల, శమంతకమణి పరస్పరం ఎదురుపడ్డారు.

ఈ సందర్భంగా యనమలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏమయ్యా.. మా దళితులకు ఎలాగూ పదవులు ఇవ్వరు. గౌరవం ఎటూ లేదు.  మా ఇంట్లో వివాహానికి ఎవరూ రాకూడదా? అందరూ వస్తారని మేము ఎదురుచూస్తుంటే.. మీరేమో వాళ్లని పోలవరం తీసుకుపోయారు. మా మనవరాలి (శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యామినిబాల కుమార్తె) పెళ్లి ఈ నెల 16న అనంతపురంలో జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించినా వారిని రానివ్వకుండా పోలవరానికి తీసుకుపోయారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ సోదరుడు శ్రీనివాస్‌ కుమార్తె పెళ్లి 23వ తేదీన అనంతపురంలో జరుగుతుందని ఏకంగా రెండు సభలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చేస్తారా? ఏం.. మా ఇళ్లల్లో శుభకార్యాలకు ఎవరూ రాకూడదా? ఇదేం న్యాయమయ్యా మీకు?’’ అని నిలదీశారు.

ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమి చెప్పాలా అర్థంకాక యనమల మౌనంగా ఉండిపోయారు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. గురువారం పయ్యావుల కేశవ్‌ సోదరుడి కుమార్తె వివాహం కర్నూలు రేంజ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ కుమారుడి తో జరగనుంది. ఈ వివాహానికి ప్రముఖులంతా హాజరుకానున్నారు.

loader