భార్యను సజీవదహనం చేసిన భర్త ఎట్టకేలకు చిక్కాడు

Man arrested in Mumbai for killing wife
Highlights

తన భార్య జీతూను సజీవదహనం చేసిన వ్యక్తి విరాజ్ చివరకు పోలీసులకు చిక్కాడు.

ముంబై: తన భార్య జీతూను సజీవదహనం చేసిన వ్యక్తి విరాజ్ చివరకు పోలీసులకు చిక్కాడు. కుటుంబ సభ్యులే అతన్ని పోలీసులకు పట్టించారు. కేరళలోని త్రిసూర్ కు చెందిన విరాజ్ అందరూ చూస్తుండగా పెట్రోల్ పోసి భార్యకు నిప్పంటించిన విషయం తెలిసిందే. 

భార్యపై దాడి చేసిన తర్వాత అతను పారిపోయి ముంబైలోని తన కుటుంబ సభ్యుల ఇంట్లో తలదాచుకున్నాడు. అతను చేసిన నిర్వాకం తెలిసిన కుటుంబ సభ్యులు తమ వద్దే ఉంచుకుని అతన్ని పోలీసులకు అప్పగించారు. పుదుక్కాడ్ ఎస్ఐ నాయకత్వంలోని పోలీసుల బృందం అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుంది. 

టీవీల్లో వస్తున్న వార్తలను చసి విరాజ్ బంధువులు అతను తమ వద్ద ఉన్న సమాచారాన్ని పోలీసులకు అందించారు. అతను ముంబైకి పారిపోయాడి తెలుసు గానీ అతని బంధువుల ఫోన్ కాల్ వల్ల త్వరగా పట్టుకోగలిగామని పుదుక్కాడ్ సిఐ చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకుని కేరళకు తీసుకుని వచ్చేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని చెప్పారు.  

తన భార్యకు జీవించే హక్కు లేదని అంటూ ఓ వ్యక్తి తన భార్యను అందరూ చూస్తుండగా చంపేశాడు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఆమెను హత్య చేశాడు. కేరళలోని చెంగళూర లో ఆదివారం ఈ దారుణమైన సంఘటన జరిగింది. 

త్రిసూర్ కు చెందిన జీతూ నెల రోజులుగా భర్తకు దూరంగా ఉంటోంది. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. తనకు న్యాయం చేయాలని కోరడానికి ఆదివారంనాడు తన తండ్రితో కలిసి చెంగలూరులోని కుదుంబశ్రీ కార్యాలయానికి వచ్చింది. 

ఆ కార్యాలయం ఆమె భర్త విరాజ్ ఇంటికి సమీపంలోనే ఉంటుంది. దాంతో అతను కోపంతో అక్కడికి చేరుకున్నాడు. కార్యాలయం నుంచి బయటకు వస్తున్న జీతూపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఏం జరుగుతుందో గమనించేలోగానే అతను అక్కడి నుంచి పారిపోయాడు. 

అతను పారిపోతూ ఓ లేఖను అక్కడి వదిలిపెట్టాడు. ఆమెకు బతికే హక్కు లేదు కాబట్టి చంపేశానని అందులో రాసినట్లు పోలీసులు చెప్పారు. జీతూ తనను మోసం చేసిందని, పెద్ద యెత్తున అప్పులు చేయించిందని ఆ లేఖలో చెప్పాడు. తాను కూడా ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నట్లు అందులో రాశాడు. 

రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన జీతూ సోమవారం నాడు మరణించింది. అతను స్థానికంగా వెల్డింగ్ పనులు చేస్తూ ఉండేవాడు. 

తన భార్య వేరొకరితో ఉండడం చూసినప్పటి నుంచి జీతూతో గొడవ పడుతూ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెల రోజుల క్రితం వారిద్దరు గొడవ పడ్డారు. అప్పుడు వారిద్దరినీ స్టేషన్ కు తీసుకుని వచ్చి సర్దిచెప్పారు. అయితే, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటామని చెప్పారు. కానీ జీతూను చంపాలని అప్పటి నుంచే చంపాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.

loader