ఎవరో ముక్కు మొఖం తెలియని మహిళకు కిడ్నీ దానం చేయాలంటే చాలా గుండె ధైర్యం కావాలి

 ప్రఖ్యాత నేపథ్య గాయని కె ఎస్ చిత్ర ఇపుడు అమెరికాలో ఉన్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకునేందుకు న్యూ జెర్సీలోని సోదరి దగ్గిరకు వెళ్లారు. అక్కడ ఆమెకు రేఖానాయర్ పరిచయం అయ్యారు. అసలు విషయం తెలిసిం తర్వాత రేఖను తన అభిమానులకు పరిచయం చేయకుండా ఉండలేక పోయారు. రేఖా నాయర్ ప్రవాస మలయాళీయులలో బాగా పేరున్న మహిళ. విజయవంతంగా నడుస్తున్న మాళవిల్ మలయాళీ ఎఫ్ ఎం చానెల్ వెనక ఉన్న వాళ్లలో రేఖ ఒకరు. రేఖ వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అయితే, ఈ ఎఫ్ ఎమ్ చానెల్ లో ఆమె ప్రోగ్రాం డైరక్టర్. ఆమె రేఖను ఫేస్ బుక్ ద్వారా అందరికీ పరిచయం చేయాలనుకున్నారు. ఎందుకో తెలుసా, రేఖ ఎఫ్ ఎమ్ చానెల్ విజయవంతం చేసినందుకు కాదు. అది ఏమాత్రం విశేషం కాదు. రేఖ ఈ మధ్య ఎవరూ సాహసించని ఒక పని ఆమె చేశారు. ఒక మలయాళీ మహిళకు తన కిడ్నీ దానం చేశారు. పరిచయం కూడా లేని ఒక మహిళకు ఇలా కిడ్నీ దానం చేయడం చాలా చాలా సాహసోపేతమయిన నిర్ణయం. రేఖ వయసు కేవలం 33 సంవత్సరాలే. ఆమెకు ఒక పాప, ఒకబాబు ఉన్నారు.అయినా సరే కిడ్నీ దానం చేసేందుకు రేఖ వెనకాడలేదు. ఇంతగొప్ప పనిచేసిన రేఖను అభినందించకుండా ఉండటం సాధ్యంకాదు.అందుకే తన ఫేస్ బుక్ లో చిత్ర రేఖతో తాను తీయించుకున్న ఫోటో పోస్టు చేశారు. చిత్ర గురించి వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటి దాకా అన్ని భాషలలో ఆమె దాదాపు 25వేల పాటలు పాడారు.