Asianet News TeluguAsianet News Telugu

కొత్త పొద్దు పొడుస్తున్నదెక్కడో చూశావా?

మీ అర్భన్ ఉన్మాద ప్రవచనాలతో జిగ్నేష్ లాగే వీడూ ద్రోహి అనకండి. చరిత్ర మిమ్మల్ని క్షమించదు.

kerala tribal man madhus death points to a new change occurring in India

ఒక  నెల కింద కేరళలో రెండు కేజీల బియ్యం దొంగతనం చేసాడు అనే నెపంతో మధు అనే ఆదివాసీని అత్యంత క్రూరంగా చంపి వేసారు. దశాబ్దాల వామపక్ష చైతన్యం ఈ ఒక్క సంఘటన తో ఆబాసు పాలు అయ్యింది. మంచి చెడులు రూపాయ నాణేనికి రెండు బొమ్మల్లా అక్కడే ‘విజూ క్రిష్ణన్’ కూడా పుట్టాడు. ఎవరీ పోరాగాడు? వారం రోజులుగా నెత్తు రోడు తున్న మట్టి పాదాలు  సకల సంపదలు కలిగిన దేశమును తమ చెమట నెత్తురుతో కడిగేస్తున్నాయి. పాదాలా అవి బ్రహ్మ కడిగిన పాదాలా ?? వ్యవస్థ నుదిటిమీద మొలిచిన గీతలు. యవరాణి  అంతఃపురం అభ్యంగన స్నానాల తొట్టిమీద ఉన్న ప్రేమ ఎందుకో ఆ మట్టి పాదాలు చూస్తే అసహ్యం వేసి ఉంటాది. కనికట్టు కట్టి టి.వి డబ్బాలకు చినిగిన చొక్కాలు, నుదిటిన  పేరిన ఉప్పు, చెమట సుగంధం దుర్గంధం అవడం నాకయితే ఆశ్చర్యం అనిపించలా కానీ ఒక్క పోరడు కన్నూరు జిల్లా ‘కరివేల్లూరు’ గ్రామ పోరడు. నాసిక్ నుంచి ముంబై దాకా శ్రమజీవుల మట్టిపాదాలకు చరిత్ర పుటలలో స్థానం కలిపించాడు. 


మీకు మలబార్ పోరాటం తెలుసా? మీకు కరివెల్లూరు భూమి పుత్రుల రక్త చరిత్ర తెలుసా? మలబార్ అడవుల్లో భూమి కోసం భుక్తికోసం హక్కుల కోసం రైతులు చేసిన పోరాటాలు తెలుసా? బిర్సా ముండా తెలుసా? రాంజీ గోండు తెలుసా ? కొమురం భీం,వివేక్,శ్రుతి,ప్రభాకర్ ? వాళ్ళకు ఒక్కటే తెలుసు ఈ వ్యవస్థ కడు క్రూరమైనది తిరుగు బాటు మినహా శరణ్యం లేదు అని నమ్మారు. చరిత్ర పుటల్లో మిగిలారు. 
బస్సులో సీట్ కోసం కర్చీఫ్ వేసినట్టు కొన్ని కులాలు చీమలు పెట్టిన పుట్టల్లోకి పాముల్లా దూరాయి. దశాబ్దాల సంప్రదాయ వామపక్ష యుద్దాలు ఎప్పుడూ ఎన్నికల వైకుంటపాళీలో చివరా కరన పామునోటికే చిక్కి పోతున్నాయి. అదో రాజకీయ చదరంగం బడుగు జీవుల చెమట నెత్తురు ఉచిత పెట్టుబడి అంతే అయినా ఏదయినా జరగక పోతాదా అని రోజుల తరబడి నీరూ నీడా వంటి మీద ఆచ్చాదన లేని బ్రతుకు జీవులు “చీమల్లా ఆధునిక ప్రజాస్వామిక ఆట వెలది అర్బన్ ప్రవచిత పోరాటాలను యెగిరి తన్నారు”. దమ్ముంటే కారిన ఆ రక్తం కరీదు ఎంతో చెప్పు ? ఇప్పుడు రెండున్నర ఇంచుల స్క్రీన్ వర్చువల్ ప్రవచనాలకు మీ బుట్టలు నిండవు. కాలు కదలకుండా వేసిన కుర్చీలు నిండాక వచ్చి మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ అంటే కుదరదు బాసూ. జనాలు పిచ్చోళ్ళు కాదు ఒక్కరోజు వస్తారు. ఇడ్లీ సమాసా చాయ్ బిస్కెట్ కోసం రెండు రోజుల డ్రామా రెండిన్చుల స్క్రీన్ కు మాత్రమే పరిమితం అవుతాయి. 


ఇప్పుడు మార్పు నాసిక్ నుండి రావాలి. ఇప్పుడు మార్పు ఉనా నుండి రావాలి. ఇప్పుడు మార్పు జె ఎన్ యు నుండి రావాలి. ఎస్ వాళ్ళు నిరూపించారు. ఉమర్ ఖాలిద్, కన్నయ్య, అనిర్భవ్. జిగ్నేష్ మేవాని, ఆనంద్ టెల్తుంబ్డే. వాళ్ళకు ప్రజలు తెలుసు ఆకలి తెలుసు త్యాగాలు తెలుసు. ఆ స్పూర్తే విజూ కృష్ణన్ కు కూడా ఉంది. అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాయింట్‌ సెక్రటరీ. భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మార్పులపై డాక్టరేట్‌ చేసాడు. డాక్టర్ డిగ్రీ తో ఒక ప్రొఫెసర్ కొలువు లోకి పోగలడు పొయ్యాడు. లక్ష రూపాయల జీతం వదులుకొని నాసిక్ మట్టి పొరల్లో మొలకలకు నీళ్ళు పోస్తున్నాడు. వాడు మార్పు కోరేవాడు. ఈ కాలం కడుపుతో ఉండి ఉమర్ ఖాలిద్, కన్నయ్య, అనిర్భవ్ .జిగ్నేష్ మేవాని, ఆనంద్ టెల్తుంబ్డే. ఆ కుటుంబం లోకి విజూ కృష్ణన్ చేరాడు. మార్పు ఇప్పుడు గ్రామాలను నుండి రావాలి పొలాలలో పరిగ జింజ చెప్పాలి నీకడుపులో గింజ ఎలా వచ్చిందో.  మీ అర్భన్ ఉన్మాద ప్రవచనాలతో జిగ్నేష్ లాగే వీడూ ద్రోహి అనకండి. చరిత్ర మిమ్మల్ని క్షమించదు.

*Dr.Gurram Seetaramulu
seetaramulu@gmail.com

Follow Us:
Download App:
  • android
  • ios