ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యం నుండి రాజరికం వైపు మళ్ళించాలనుకుంటున్నారా? తాజాగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ ఆయనేమన్నారు? టిడిపినే 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తుందని. అందులో తప్పేమీ లేదు. కాకపోతే 2024లోనూ ఆపై 2029లో కూడా ఇదే రిపీటవుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు. చంద్రబాబు మాటలను బట్టి చూస్తే మరో పదిహేనేళ్ళ పాటు టిడిపినే అధికారంలో ఉంటుంది. గతంలో కూడా 20 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామంటూ విజన్ 20:20 అని ఊదరగొట్టారు. ఏమైందో అందరూ చూసిందే.

మరి, టిడిపినే అధికారంలో ఉంటుందంటే చంద్రబాబే శాస్వత ముఖ్యమంత్రిగా ఉంటారనే కదా అర్ధం. ఆయన తర్వాత కొడుకు లోకేష్ ఎటూ ఉండనే ఉన్నారు కదా? అంటే వారసత్వంగా కుటంబపరంగా వచ్చే ఆస్తుల, అప్పుల్లాగ ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అందుకోనున్నారు. సరే, తర్వాత ఎటూ లోకేష్ కొడుకు దేవాన్ష్ రెడీ అవుతారు కదా? ఇప్పటి నుండి దేవాన్ష్ ను పలువురు మంత్రులు భవిష్యత్ ముఖ్యమంత్రిగా కీర్తిస్తున్నారు ఎప్పటి నుండో ఎందుకైనా మంచిదని.

తండ్రి రాజకీయాల్లో ఉంటే కొడుకులు కూడా రాజకీయాల్లో అందలాలు ఎక్కటం చాలా ఈజీ. కాబట్టి లోకేష్, దేవాన్ష్ లు ముఖ్యమంత్రులు కావటానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కాకపోతే అందుకు అదృష్టం కూడా తోడవ్వాలి. ఈ విషయంలో జగన్ కు కొద్దిలో అదృష్టం 2009లో చేజారిపోయింది. 2014 ఎన్నికలో కూడా అదృష్టం వెంట్రుకవాసిలో తప్పిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక, 2019 సంగతిని ఇప్పుడే చెప్పటం కష్టం.

సరే, ప్రస్తుత విషయానికి వస్తే చంద్రబాబు తర్వాత కొడుకు, ఆ తర్వాత మనవడు ఇలా..నారా వంశమే ఏపిని పాలించాలని చంద్రబాబు కలలు కంటున్నారు. సిఎం పదవి వంశపారంపర్యంగా వచ్చేది ఒక్క రాజరికంలోనే. ప్రజాస్వామ్యంలో అందరికీ సాధ్యం కాదు. సరే, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్నాటక, ఒడిస్సా, కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో కొందరికి మినహాయింపు ఉందనుకోండి అది వేరే సంగతి. ఏపి వరకూ తీసుకుంటే ముఖ్యమంత్రుల కొడుకులెవరూ ముఖ్యమంత్రులు కాలేదు. మరి చంద్రబాబు కోరిక నెరవేరుతుందో లేదో కాలమే చెప్పాలి.