ఇన్ఫోసిస్ కొత్త సీఈవో గా సలీల్ ఎస్ పరేఖ్

ఇన్ఫోసిస్ కొత్త సీఈవో గా సలీల్ ఎస్ పరేఖ్

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ కంపెనీ కొత్త సీఈవోని ప్రకటించింది. క్యాప్‌జెమినీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సలీల్‌ పరేఖ్‌ను సీఈవోగా నియమించినట్లు సంస్థ శనివారం ప్రకటించింది. కాగా.. పరేఖ్‌ క్యాప్‌జెమినీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కొద్ది గంటలకే ఇన్ఫోసిస్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

పరేఖ్‌ ఫ్రాన్స్‌ కు చెందిన ఐటీ సర్వీసెస్‌ కంపెనీ క్యాప్‌జెమినీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఆయన క్యాపీ జెమినీకి రిజైన్ చేసినప్పటికీ.. 2018, జనవరి 1 వరకు కంపెనీ నార్మ్స్ ప్రకారం అందులోనే కొనసాగుతారు. జనవరి 2న ఇన్ఫోసిస్‌ సీఈవోగా బాధ్యతలు చేపడతారు. పరేఖ్‌.. బాంబే ఐఐటీ నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తిచేశారు. కార్నెల్‌ యూనివర్శిటీలో మాస్టర్స్‌ చదివారు.

‘ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీగా సలీల్‌ పరేఖ్‌ను కంపెనీలోకి ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఐటీ రంగంలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పరేఖ్‌ నేతృత్వంలో ఇన్ఫోసిస్‌ మరింత ముందుకెళ్తుందని బోర్డు విశ్వసిస్తుంది’ అని ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని తెలిపారు.

కంపెనీ వ్యవస్థాపకులతో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఆగస్టులో విశాల్‌ సిక్కా ఇన్ఫోసిస్‌ సీఈవో పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న యూబీ ప్రవీణ్‌ రావుకు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పగించారు. జనవరి 2న ప్రవీణ్‌ రావు సీఈవో పదవి నుంచి వైదొలిగి పూర్తిస్థాయి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ బాధ్యతలను కొనసాగిస్తారని కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos