పవన్ కళ్యాణ్ కి అంతర్జాతీయ పురస్కారం ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ (ఐఈబీఎఫ్‌) ఎక్స్‌ లెన్స్‌ అవార్డుకు ఎంపికైన పవన్ నవంబర్‌ 17న హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సమావేశంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్న పవన్
రానున్న ఎన్నికల్లో.. జనసేన పార్టీ పోటీ చేస్తుందో లేదో తెలీదు కానీ.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం గుర్తింపు సాధించేసింది. జనసేన పార్టీకి మద్దతుగా కొందరు.. వ్యతిరేకంగా కొందరు నిత్యం ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉండగా.. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అంతర్జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) ఎక్స్ లెన్స్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. నవంబర్ 17న హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నారు.
ఇటీవలే అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ పవన్ కల్యాణ్ను గౌరవించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రతిష్ఠాత్మక ఎక్స్ లెన్స్ అవార్డు వరించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఏటా గ్లోబల్ బిజినెస్ మీట్ సందర్భంగా ఈ అవార్డుతో ఐఈబీఎఫ్ గౌరవిస్తోంది. ఈ సంవత్సరం ఆ అవార్డును పవన్ కల్యాణ్కు అందజేయాలని నిర్ణయించింది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్కు ఈ ఏడాది ఎక్స్ లెన్స్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐఈబీఎఫ్ ఇండియా విభాగం అధిపతి సునీల్ గుప్తా, సమన్వయకర్త చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు పవన్ను కలిసి ఆహ్వానాన్ని అందించారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాదిమంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, కృషి ఎన్నో హృదయాలను హత్తుకున్నట్లు వారు కొనియాడారు. దీనికి పవన్ కళ్యాణ్ సూత్రపాయంగా అంగీకారం తెలిపారు.
