హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలాయి. హైదరాబాదులో కూడా అదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తీవ్రత ఎక్కువగా ఉంది.

వరంగల్ లో రైల్వే హైటెన్షన్ వైర్లపై రేకులు పడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గురువారంనాడు ఆంధ్రప్రదేశ్ లో నలుగురు, తెలంగాణలో ఇద్దరు మరణించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి.

వరంగల్ లోని ఎస్ఆర్ నగర్ లో ఇల్లు కూలి ఒకరు మరణించగా, హైదరాబాదులోని ఆరాంఘర్ లో గోడ కూలి ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. నార్కెట్ పల్లి, అద్దంకి హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. విశాఖపట్నంలో కెజిహెచ్ లోని పిల్లల వార్డులోకి నీరు వచ్చి చేరింది. విశాఖలోని ప్రభుత్వ ఘోషా ఆస్పత్రిలో విద్యుత్తు నిలిచిపోయింది. గుంటూరులో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. హోర్డింగ్ కూలి ఒకరు మరణించారు. అమరావతి పరిసరాలు చీకటిగా మారాయి.

నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లా భారీ వర్షాలతో వణికిపోయింది. పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిడుగులకు ముగ్గురు మరణించారు.  

విశాఖపట్నంలోని కాన్వెంట్ సెంటర్ వద్ద వంతెన కింద భారీగా నీరు నిలిచింది. ఇందులో సిటీ బస్సు ఒకటి ఇరుక్కుపోయింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. 

విజయవాడలోని పలు ప్రాంతాల్లో హోర్డింగులు కూలాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బందరు రోడ్డు నీట మునగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లాలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండగా మరోవైపు పిడుగులు పడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 41,025 పిడుగులు పడినట్లు వార్తలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలోనే 11,955 పిడుగులు పడినట్లు తెలుస్తోంది. పిడుగులను గుర్తించడానికి విద్యుత్తు శాఖ సెన్సార్లను ఏర్పాటు చేసింది. సెన్సార్లు మెరుపులను కూడా పిడుగులుగా నమోదు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పిడుగుపాట్లకు రాష్ట్రంలో 39 మంది మరణించినట్లు అంచనా వేస్తున్నారు. భూతాపం పెరగడమే పిడుగులకు కారణమని అంటన్నారు. 

భారీ వర్షంతో అమరావతిలోని ఎపి సచివాలయంలోకి వర్షం నీరు చేరింది. భవనాలు పూర్తిగా తడిసిపోవడంతో అక్కడక్కడ సీలింగ్ ఊడిపోయి నీరు కార్యాలయాల్లోకి ప్రవేశిస్తోంది. మున్సిపల్ మంత్రి నారాయమ ఛాంబర్ లో సీలింగ్ ఎగిరిపోయాయి. సీలింగులు ఊడిపోవడంతో సిబ్బంది తలుపులు పట్టుకుని కాపలా కాస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వైఎస్ గన్ ఛాంబర్ వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. ఎవరూ పైకి వెళ్లకూడదని, వీడియోలు తీయకూడదని ఆంక్షలు విధించారు.