తిరుమలప్రసాదాల్లో ప్రపంచఖ్యాతి పొందిన లడ్డూప్రసాదంపై పెద్ద భారమే పడబోతోంది. త్వరలో అమలులోకి రానున్న జిఎస్టీ కారణంగా తిరుమలలో ప్రతిదీ  ఖరీదుగా మారిపోతోంది. శ్రీవారి దర్శానానికి ప్రతిరోజు ప్రపంచం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారన్న విషయం తెలిసిందే. జిఎస్టీ అమలులోకి వస్తే తిరుమలకొండపైన శ్రీవారి దర్శనానికి తీసుకునే టిక్కెట్లు, ప్రసాదాలు, సేవలతో పాటు కాటేజీలు కూడా బాగా ఖరీదైపోతాయి. ధరలు పెరిగిపోతే భక్తులకు ఇబ్బందనే జిఎస్టీ పోటు నుండి తిరుమల తిరుపతి దేవస్ధానాన్ని మినహాయించమని కోరినా కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు.

2003లో అమలులోకి వచ్చిన వ్యాట్ పన్ను నుండి ప్రభుత్వం టిటిడిని మినహాయించినా జిఎస్టీ నుండి మాత్రం మినహాయింపు పొందలేకపోయింది. వివిధ దర్శనం టిక్కెట్ల, ఆర్జిత సేవల ద్వారా ఏటా రూ. 300 కోట్లు ఆర్జిస్తోంది. కాటేజీలు, అతిధి గృహాల ద్వారా రూ. 124 కోట్లు, భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా రూ. 100 కోట్లు ఆర్జిస్తోంది. ఇకపై వీటన్నింటిపై జిఎస్టీ పన్ను పడటం ద్వారా వీటి ధరలు పెరిగిపోతాయి.

రోజుకు తిరుమలకు సగటున 80 వేలమంది భక్తులు వస్తారన్నది అంచనా. వారందరికీ అన్న, ప్రసాదాలను టిటిడి అందిస్తోంది. మొత్తం శ్రీవారి ప్రసాదాల్లో లడ్డూ ప్రసాదానికి ఉన్న ఖ్యాతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి అన్న ప్రసాదాల తయారీకి ఏడాదికి టిటిడి రూ. 450 కోట్లు ఖర్చు చేస్తోంది. జిఎస్టీ కారణంగా సుమారు రూ. 60 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.