ప్రపంచంలో అత్యంత బరువుగల మహిళగా గుర్తింపు పొందిన ఎమన్ అహ్మద్ కొంతకాలం ముంబయిలో చికిత్స పొందిన ఎమన్ అబుదాబిలో చికిత్స పొందుతూ మృతి

ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలు ఎమాన్‌ అహ్మద్‌ కన్నుమూశారు. ఈజిప్టుకు చెందిన ఎమాన్‌ చికిత్స నిమిత్తం 2016లో ముంబయికి తీసుకువచ్చారు. ఇక్కడి సైఫీ ఆస్పత్రిలో కొంతకాలం ఆమెకు చికిత్సను అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెని అబుదాబిలోని బుర్జీల్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఆమె చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ముంబయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు సగం బరువు తగ్గిన ఎమాన్‌ తనంతట తానే తినగలిగే స్థితికి చేరిందని గతంలో వైద్యులు తెలిపారు.

అయితే ఎమన్ విషయంలో డాక్టర్లు అబద్ధం చెప్పారని ఆమె సోదరి షైమా సలీం ఆరోపణలు చేశారు. తన సోదరికి సరైన చికిత్స అందడం లేదనీ, ఎమన్ ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో ఉందని షైమా ఆరోపిస్తూ డాక్టర్ ముఫజల్ వ్యాఖ్యలను ఖండించారు. ఎమన్‌ను చికిత్స కోసం ముంబైకి తీసుకొచ్చిన డాక్టర్ ముఫజల్ ఓ అబద్ధాలకోరని, తన చెల్లెలు బరువు తగ్గిపోయిందంటూ డాక్టర్ అబద్ధాలు చెబుతున్నారని ఓ వీడియో కూడా బయటపెట్టారు. ‘‘ ప్రస్తుతం ఆమె కనీసం మాట్లాడలేకపోతోంది. ఏమాత్రం కదల్లేకపోతోంది. చర్మం మొత్తం నీలం రంగులోకి మారిపోతోంది. కనీసం కొంచెం కూడా కోలుకున్నట్టు కనిపించడం లేదు’’ అని అసలు విషయం చెప్పారు.

ఈ నేపథ్యంలో ముంబైలో సరైన వైద్యం లభించలేదంటూ.. 12 వారాల పాటు చికిత్స పొందిన అనంతరం ముంబయి నుంచి అబుదబి తీసుకొని వెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.