చాలా కాలంగా జగన్ను తెలుగుదేశమోళ్లు తిట్టడం,జగన్ వాళ్లని ఏకిపారయేడం  చూస్తున్నాం. అటవిడుపు లేకుండాపోయింది.  దీనికి తోడు మధ్య మధ్య జెసి దివాకర్ రెడ్డి పిట్టకథలు. ముద్రగడ పాదయాత్ర బెదిరింపులు, పోలీసుల నిషేధాజ్ఞలు, నారా లోకేశ్ రెండు లక్షల ఉద్యోగాలు, జనసేనాని ప్రవేశం వాయిదాల మీద సాగుతూ ఉంది, చిరంజీవి సినిమాల్లో పడిపోయారు, వుండవెళ్లి మళ్లీ మౌనంగా ఉన్నారు..అందుకే మొత్తం ఆంధ్రప్రదేశంతా రాజకీయకంపు గొడుతూ ఉంది.మరొక ముచ్చటే వినిపించడమే లేదు. రిలీఫ్ ఇచ్చేందుకు జనసత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్  మళ్లీ రోడ్డెక్కుతున్నారు. రాజకీయ వ్యవస్థనాశనమవుతూ ఉందని, మంచి రాజకీయాల గురించి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన నూరు రోజుల సురాజ్య యాత్ర బయలు దేరుతున్నారు. ఈ యాత్ర విశాఖ నుంచి మొదలయివుతుంది. ఈ నెల 15 నుంచి యాత్ర మొదలయి విశాఖపట్టణం జిల్లాలో నాలుగు రోజులు సాగుతుంది. తర్వాత  19 వ తేదీన తూర్పూగోదావరి జిల్లో ప్రవేశిస్తుంది. ఈ జిల్లాలో  సెప్టెంబర్ 23 వరకు జయప్రకాశ్ నారాయణ్ పర్యటిస్తారు.ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఆయన నూరు రోజులు పాటు పర్యటించనున్నారు. జయప్రకాశ్ నారాయణ్ పర్యటన విశేషాలను లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ విశాఖ లో వెల్లడించారు. ‘ పార్టీలకు అతీతంగా జనహితం కోసం జయప్రకాశ్ నారాయణ్ సురాజ్య యాత్ర చేపడుతున్నారు. రాజకీయ నేతలు అబద్ధాల వాగ్దానాలు చేయకుండా, కులమతాలలోప్రజలను వీడదీయకుండా జనాన్ని అప్రమత్తం చేయడం యాత్ర ఉద్దేశం,’ బాబ్జీ తెలిపారు. ఒకపుడు కందాళ సుబ్రహ్మణ్యం, తిలక్, కోనేటి రామ్మోహన్ రావు వంటి గొప్పనేతలు రాష్ట్రం నుంచి తొలిలోక్ సభకు వెళ్లారని, ఇపుడు తెలుగునాట రాజకీయవ్యవస్థ భ్రస్టు పట్టిందని  ఆయన అన్నారు. మార్పు కోరుకేనే యువతీయువకులంతా జయప్రకాశ్ యాత్రలో భాగస్వాములుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీటింగులకు జనాన్నితోలేందుకు డబ్బులు, ‘ఎగస్పార్టీ’ మీటింగ్ కు వెళ్లకుండా ఉండేందుకుడబ్బులు  వోటే వేస్తే డబ్బు, వోటు వేయకుంటే డబ్బు... డబ్బు రాజకీయం ఇలా వర్థిల్లుతున్నపుడు  జయప్రకాశ్ నారాయణ్ మంచి మాటలు వినేవోళ్లు ఉంటారా రాష్ట్రంలో....