బెంగళూరు: దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ పై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. కాంగ్రెసును దేవెగౌడ పార్టీ కాపాడుతోందని ఆయన అన్నారు. తుమకూరులో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచార సభలో ఆయన శనివారంనాడు ప్రసంగించారు. 

తాను అధికారంలోకి రాకుండా చేయడానికి జెడిఎస్ చేయాల్సన ప్రయత్నాలన్నీ చేసిందని ఆయన అన్నారు. లోకసభ ఎన్నికల సమయంలో తాను కర్ణాటకకు ప్రచారానికి వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని దేవెగౌడ బెదిరించాడని, అయినప్పటికీ దేవెగౌడపై తనకు గౌరవం ఉందని మోడీ అన్నారు. 

దేవెగౌడ వందేళ్లు జీవించి సమాజానికి సేవ చేయాలని ఆయన అన్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు, జెడిఎస్ రహస్య అవగాహనకు వచ్చాయని ఆయన విమర్శించారు. జెడిఎస్ కాంగ్రెసును ఓడించలేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని సర్వేలు తేల్చాయని, కర్ణాటకలో ప్రభుత్వం మారాలంటే అది బిజెపితోనే సాధ్యమవుతుందని అన్నారు. 

జెడిఎస్ తో రహస్య అవగాహన ఉందా, లేదా అనే విషయంపై కాంగ్రెసు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేవెగౌడ మద్దతుతోనే బెంగళూరులో కాంగ్రెసు మేయర్ పదవిని దక్కించుకుందని అన్నారు. దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని, ప్రజలకు వాస్తవాన్ని వెల్లడించే సాహసం కాంగ్రెసు చేయాలని మోడీ అన్నారు.