నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా అయోమయంలో పడ్డారు.  దీనికి కారణం, మొన్న ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఒక బిల్లు రాలేదు. అదే ఆయన అయోమయానికి కారణం. బిల్లేమిటంటే, రైతు సమన్వయ సమితులు రాష్ట్రస్థాయి కమిటీకి చట్టబద్ధత కల్పించే బిల్లు. సభలో 11 బిల్లులు పాసయ్యాయి. ఈ బిల్లు రాలేదు. ఈ బిల్లు వస్తే ఆయనకు పదవి వస్తుందని నమ్మకం ఉండేది. ఆయనను రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీకి క్యాబినెట్ హోదాతో కన్వీనర్ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని అంటున్నారు. మరి ఇపుడెలా?  ఇదే సమస్య?  పార్టీ మారి చెడ్డపేరు తెచ్చుకుని ఏడాయింది. పదవి లేదు. పండగ లేదు.ఫిరాయింపు దండగయిందని ఆయన ఆవేదన చెందుతున్నారని అంటున్నారు.


 కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో గెల్చినా, ఆయన ఆ మధ్య ఫిరాయించి టిఆర్ ఎస్ లోచేరారు.  లోపల అగ్రిమెంట్ ఒకటయితే, పైకి మాత్రం ‘బంగారు తెలంగాణ’ నిర్మాణం కోసమే టిఆర్ ఎస్ లో చేరి కెసిఆర్ తో చేతులు కలుపుతున్నానని  ప్రకటించారు.అయితే,ఇపుడదే ఆయన్ని నోటికి తాళం వేసింది.

 నిజానికి, రాష్ట్రంలో కేబినెట్ మంత్రి పదవో లేదా క్యాబినెట్ హాదా ఉన్న పదవో  వస్తుందనుకుని గులాబి గుచ్ఛం పుచ్చుకున్నారు. సంవత్సరం గడిచిపోయింది. ఏ పదవీ రాలేదు. ఎదురుచూపులు, నిరాశ మిగిలిపోయాయి.  పదవీయకపోవడం మీద ఆయన నిరసన  వ్యక్తం చేయలేడు, ఎందుకంటే, చేరింది ‘బంగారు తెలంగాణ’ కోసం. అలాగనీ మౌనంగా కూర్చోనూ లేడు, కారణం, పార్టీ ఫిరాయించినా ఫలితం లేకపోవడం. దానికి తోడు ఈ మధ్య టీడీపీ నల్గొండ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరారు.సొంత బావమరది  దుబ్బాక నరసింహారెడ్డిని తొలగించి భూపాల్ రెడ్డికి నల్గొండ పార్టీ బాధ్యతలు కట్టబెట్టారు.


దీనిని గుత్తా జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా బావమరిదిని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్న. ఈ నేపథ్యంలో టిఆర్ ఎస్ లో ఎందుకు వచ్చానా, కాంగ్రెస్ లోకి  తిరిగి వెళితే ఎలా ఉంటుందని గుత్తా యోచిస్తున్నారని ఆయన  వర్గంలోనే గుసగుసలు వినబడుతున్నాయి.

 

వీడియో ఇక్కడ చూడండి

https://goo.gl/mHvjsz