Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అక్షరం శోకిస్తున్నది...

సినారె అనే మాటలో ఉండేవి మూడక్షరాలే. కాని ఈ మూడక్షరాల గురించి ఎంత రాసినా  ఇంకా మిగిలే ఉంటుంది. ఈ మూడక్షరాలు వెలకట్టలేని సాహిత్యనిధి.  ఇక్కడ కొంతమంది సాహితి మిత్రులు స్పందించిన తీరులో సినారె మూడక్షరాల లోతుపాతులు కొంత తెలిసే అవకాశముంది. 

death of cinare end of a glorious era in Telugu literature

 

 

కవిత్వమే ఊపిరిగా బతికిన సినారె కు కవిసంగమం నివాళులు ! ఒక కవి సుదీర్ఘనిద్రలోకి జారిపోయాడు.ఒక శకం ముగిసింది. కవిత్వమూ, పాట, పరిశోధన,అధ్యాపకత్వం...ఇంకా ఎన్నెన్నో పాత్రల్లో విరామమెరుగక శ్రమించి, జీవించి ఎట్టకేలకు శాశ్వతంగా విశ్రమించాడు.

- కవి యాకూబ్

***

బ్రతుకంతా పాటగా మీటినవాడు
కవిత్వమే బాటగా దాటినవాడు
ముషాయిరా వేదికపై శబ్దవిరించిగా
తెలుగువెలుగు దిశల చాటినవాడు

-షుకూర్ మియా

***

ఒక శకం ముగిసింది
~~~~~~~~~~~
తాతా...... సి.నా.రె
నీతో పోటీపడి నా కలాన్ని మెత్తగ కొచ్చెగ ఎప్పటికప్పుడు పదును పెట్టుకునేటోన్ని
నీతో పందెంకాసిన ప్రతీసారీ ఓడిపోతనే వున్న

నాకు ఓడిపోవడమే మరింత సత్తువనిచ్చింది
యువరక్తం మరింతగ మర్గబెట్టెటట్టు 
 నీ వచనాన్ని పతంగిజేసి ఎగరేత్తవు సూడు
నా సూపులన్నీ...మొగులు మీదికి నిచ్చెనేసి 
 ఒక్కొక్క తంతె ఎక్కుతానికి సుత యాష్టపడేటివి

నా జబ్బ మీద చెయ్యేసి బండారి..మెరికెలంటె ఏందిరా అని అడిగినవ్ సూడు
అంతమంది ముంగట నేను తడబడితే 
 పొట్టువూడని వడ్లా...గింజలా..అని నువ్వింకా ముచ్చట పెట్టినట్టె అనిపిత్తాంది
నీ పక్కన కూసోని ...నా అక్షరాల్ని నీ నోటివెంట విన్నప్పుడు
ఇగసాలు ఈ పుట్క కు అనిపించిందప్పుడు
అరే.. ఎంతమంది 
లేకున్నా..ఉన్నట్టే అనిపిత్తరు జెప్పు ?
నువ్వెైతే వుంటవు తాతా..

పలుకుబడులు మంచిగ పట్టుకున్నవని కారటు పంపిచ్చినపుడు 
 నేనైతే న్యాలకు నాలుగడుగులు పైన్నే తైతక్కలాడిన
పత్రికలల్ల పక్క పక్కనే మనిద్దరి కైతలను జూసుకుని ఎంత మురిసిన్నో

తాతా..పోతా పోతా..నీ మనువనికి ఒక్క మాటన్న జెప్పక పోతివే 
 "మనసు చంపుకుని బతికితే 
ఆ మనుగడకు విలువేమిటోయ్ 
చెదిరిపోయిన మమతలన్నీ
పోగు చేసుకో ఒక్కొక్కటే " అని

సదువుకున్నప్పుడల్లా ..

ఓ విశ్వ కవీ....
మాకు నిత్తెం సందేశమిస్తూనే వుంటవు
ఒక శకం ముగిసింది..శోకాన్ని మిగిల్చి

నీ పాదముద్రల్ని సూసుకుంట 
 సాహిత్య ప్రపంచం నీ వెంటే కదిలొస్తుంది
నీ ఆఖరి శ్వాసలో సుత ఏదో రాగం ఆలపించే వుంటావ్ 
ప్రకృతికి ఏదో కబురు పంపే వుంటావ్ 
విశ్వంభరా... ఇక సెలవు
నీ తపోనిద్రకు భంగంవాటిల్లనివ్వం

-బండారి రాజ్ కుమార్

***

 

పట్టపగలు వెన్నెలమ్మ 
నేలమ్మను పట్టుకుని 
బోరు భోరున 
విలపిస్తున్నట్టుంది నాకు. 
ఇవి వాన చుక్కలు కావు 
వెన్నెలమ్మ కన్నీటి చుక్కలే!

ఇగిరిపోని ఓ సాహితీ గంధమా 
వెన్నెలమ్మతో పెనవేసుకున్న బంధమా 
ఇంత నిర్దాక్షిణ్యంగా 
ఎక్కడికి ఎగిరిపోయావమ్మా?
వెన్నెలమ్మను ఓదార్చేదెవరింక!
తెలుగమ్మకి వన్నెలు దిద్దేదెవరింక !

-అత్తిలి వెంకటరమణ

***

నింగికేగిన తెలుగు సాహితీ శిఖర

 అది జానపదమా.... 
ప్రబంధమా... 
ప్రబోధమా.... 
ప్రణయమా... 
భక్తిరసమా ....

 అది ఏదైనాకానీ ...
సినారేగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డిగారి చేతిలో గువ్వలా ఒదిగిపోయాయి ...

ప్రేమికులై సరసమాడాయి...

 గులాభిలై గుభాలించాయి...

మయూరాలై నాట్యమాడాయి... 

తారాజువ్వలై ఆకసాన్ని తాకాయి...

తెలుగు అక్షరాలన్ని ...
ఒక పింగళి ...
ఒక సముద్రాల ...
ఒక వేటూరి ...
ఒక ధాశరథి...
ఒక శ్రీశ్రీ ...
ఒక దేవులపల్లి...
ఒక ఆత్రేయ...
ఒక ఆరుద్ర...
              ఒక సినారే ...

తెలుగు సాహిత్య/ సినీగీతాల తోటలో పుష్పించిన అపూర్వ పూలమాలికలు ... 
ఆ సాహితీ సువాసనలు మన ముక్కు పూటల్లో ఎప్పడూ గుభాలిస్తునే వుంటాయి. 
తెలుగునాట సినారే లే(రా)ని సాహితీ సభ జరిగేది కాదంటే అతిశయోక్తి కాదు. 
ఆయనపద ప్రయోగం, ఉచ్చారణ, నిండైన గొంతు చాలా అరుదు... 

సినారేగారు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ఉపన్యాసడిగా పనిచేస్తున్నపుడు ఒక్క తెలుగు విద్యార్థులతోనే కాకుండా.., చివరికి ఉర్దూ విద్యార్థులతో ఆయన క్లాస్ కిక్కిరిసిపోయేదంటే ఆయన ప్రజ్ఞ ఏపాటిదో తెలుస్తూంది.
 తెలుగు సాహితీవనంలో ఆయన కీర్తి అజరామరం ... అనితర సాధ్యం...
తెలుగుసాహితీ తల్లి కన్నీళ్ళు కారుస్తున్న విషాన్న విషాద వేళ యిది...

- సోషల్ మీడియా నుంచి

( ఇక్కడ అచ్చేసినవన్నీ కవిసంగమం వంటి ఫేస్ బుక్ గ్రూప్ నుంచి ఇతర వాట్సాప్ గ్రూపుల నుంచి సేకరించినవి. బ్యానర్ ఫోటో వేటుఆన్ లైన్.)

Follow Us:
Download App:
  • android
  • ios