నగరంలోకి అంతరాష్ట్ర దొంగలు నగర శివార్లు, తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
దసరా పండగ వచ్చిందంటే చాలు నగరంలోని చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు పయనమౌతారు. ఇదే అదనుగా చేసుకొని దోపిడీలకు పాల్పడేందుకు దసరా దొంగలు నగరంలోకి అడుగుపెట్టారు. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన దొంగలుగా పోలీసులు భావిస్తున్నారు. నగరంతోపాటు, శివారు ప్రాంతాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల ఆదిబట్ల, మీర్ పేట్, కీసర ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలు.
జనం తక్కువగా ఉండడం, ఇళ్లు దూరంగా ఉండడం, పోలీసులకు చిక్కకుండా క్షణాల్లో తప్పించుకొని పోయే అవకాశం ఉండడంతో శివారు ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందరూ గాఢనిద్రలో ఉండి, పోలీస్ గస్తీ తక్కువగా ఉన్న సమయంలో చోరీలకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కో ముఠాలో దాదాపు 10 మంది సభ్యు లు ఉంటున్నారని.. అందరూ కలిసి లేదా అవకాశం ఉన్నచోట రెండు ముఠాలుగా విడిపోయి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అడ్డువచ్చిన వాళ్లపై దాడిచేసేందుకు తమ వెంట కంకర రాళ్లను తెచ్చుకొంటున్నారని తెలిసింది. చోరీకి ముందు వారు ఆటోలు, బస్సుల్లో వచ్చి రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ వేస్తున్నారని, రాత్రి 12 గంటలకు టార్గెట్ ఏరియాకు చేరుకొని అర్ధరాత్రి 2 గంటల నుంచి తెలవారుజామున 4 గంటల లోపు తమ పనిని ముగించుకొని వెళ్లిపోతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేవారికోసం పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. వెళ్లేముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని చెప్పారు. ఇంటి వివరాలతో ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ మెసేజ్ పంపించాలని.. తద్వారా ఆయా ప్రాంతాల్లో గస్తీ పెంచుతామని తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులను పెట్టుకోవద్దని.. తాళాలు బయటికి కనబడకుండా వేయాలని సూచించారు. బీరువాలు, గదుల తాళంచేతులన్నీ వెంట తీసుకెళ్లాలని. రాత్రుళ్లు కనీసం ఒక్క బల్బ్ అయినా వెలిగేలా చూసుకోవాలని చెప్పారు. పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు రోజుల తరబడి బయటే పోగుకాకుండా ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
