శ్రీ వారి  బ్రహ్మూెత్సవాల్లో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఆర్జితసేవలతోపాటు వయోవ ద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని అధికారులు తెలిపారు. పెరటాసి మాసం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 23, 27(గరుడసేవ), 30వ తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ ఉండదని  వారు చెప్పారు. ఆన్‌లైన్‌లో గదుల ముందస్తు బుకింగ్‌ కోటాను 2 వేల నుంచి వెయ్యికి తగ్గించామని, ప్రతిరోజూ 4 వేల గదులు సాధారణ భక్తులకు అందుబాటులో ఉంటాయి.  బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామన్నారు. మాడ వీధుల్లో గ్యాలరీల్లో 1.80 లక్షల మంది భక్తులు వాహనసేవలు వీక్షించేందుకు అవకాశముందని, గరుడసేవ నాడు మరో 70 వేల మంది భక్తులు గ్యాలరీల బయట ఉంటారని, వీరందరి కోసం మాడ వీధుల్లో 19, ఇతర ప్రాంతాల్లో 11 కలిపి మొత్తం 30 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.  బ్రహ్మోత్సవాలకు  విచ్చేసే భక్తులందరికీ అన్నప్రసాదాలు, తాగునీరు, చంటిపిల్లలకు పాలు అందిస్తామన్నారు.

గరుడసేవనాడు ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధించామని, తిరుమలకు 7 వేల నాలుగు చక్రాల వాహనాలను అనుమతిస్తామని, ఆ తరువాత వచ్చే వాహనాల కోసం తిరుపతిలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టామని ఈవో తెలిపారు. ఆర్‌టిసి బస్సులు 4 వేల ట్రిప్పులు తిరిగి భక్తులను చేరవేస్తాయన్నారు. బ్రహ్మూెత్సవాల రోజుల్లో 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లు, అలిపిరి కాలిబాట మార్గం తెరిచి ఉంటాయన్నారు. గరుడ సేవనాడు శ్రీవారి మెట్టు మార్గాన్ని 24 గంటల పాటు తెరిచి ఉంచుతామన్నారు. శ్రీవారి ఆలయంతోపాటు ఇతర ప్రాంతాల్లో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టినట్టు చెప్పారు. పరిశుభ్రతకు పెద్దపీట వేశామని, ఆలయ నాలుగు మాడవీధులతోపాటు కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనపు సిబ్బంది ఏర్పాటుచేశామని వెల్లడించారు. ఫలపుష్ప, ఫొటో, మ్యూజియం ఎగ్జిబిషన్లను భక్తులు తిలకించాలని కోరారు. 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారని తెలిపారు. తిరుమలకు రాలేని భక్తులు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా బ్రహ్మూెత్సవాల వైభవాన్ని తిలకించాలని కోరారు. వాహనసేవల ఎదుట, తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై ఆకట్టుకునేలా ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు.

భక్తుల సౌకర్యార్థం ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు : జెఈవో  కె.ఎస్‌.శ్రీనివాసరాజు

శ్రీవారి వాహనసేవలు తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లోని పలు ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటు చేసినట్టు టిటిడి తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. ప్రధాన కల్యాణకట్ట వద్ద గల గేట్‌, అన్నప్రసాద భవనం వద్ద గల గేటు ద్వారా తూర్పు మాడ వీధిలోకి, మ్యూజియం ఎదురుగా గల గేటు ద్వారా పడమర, దక్షిణ మాడ వీధుల్లోకి, ఎన్‌4 గేటు, వరాహస్వామి విశ్రాంతి గృహం పక్క మార్గం ద్వారా ఉత్తర మాడ వీధిలోకి భక్తులు ప్రవేశించవచ్చన్నారు. అదేవిధంగా, తూర్పు, దక్షిణ మాడ వీధుల్లోని భక్తులు ఆస్థానమండపం వద్దగల గేట్లు, రాంభగీచా గేటు ద్వారా, పడమర మాడవీధిలోని భక్తులు గోవిందనిలయం పక్కన గల డబ్ల్యు4 గేటు ద్వారా, ఉత్తర మాడ వీధిలోని భక్తులు ఎన్‌7 గేటు నుంచి వెలుపలికి వెళ్లవచ్చని వివరించారు.

సిసిటివిల ద్వారా భక్తుల భద్రత పర్యవేక్షణ : సివిఎస్‌వో ఆకె రవికృష్ణ

తిరుమలలోని శ్రీవారి ఆలయం, మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం 640 సిసిటివిలు ఉన్నాయని, బ్రహ్మూెత్సవాల కోసం అదనంగా 70 సిసిటివిలు ఏర్పాటుచేశామని సివిఎస్‌వో  ఆకె రవికృష్ణ తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఆయా ప్రాంతాల్లోని సిసిటివిల ద్వారా భక్తుల భద్రతను పర్యవేక్షిస్తామని వివరించారు. 2 వేల మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 2700 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు.