అందులో ఏపీ నే నెంబర్ వన్

First Published 22, Nov 2017, 6:00 PM IST
ap cm chandrababu participate in rice canclave programe in vijayawada
Highlights
  • ఇండియా రైస్ కాంక్లేవ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు
  • బయోమెట్రిక్ విధానంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్న చంద్రబాబు
  • పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పిన చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వరి దిగుబడి చేస్తోన్న ప్రాంతాలతో పోటీపడాల్సిన సమయం ఇదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పంట దిగుబడుల సాధనలో పంజాబ్‌ రాష్ట్రాన్ని అధిగమించాలని, చైనా కంటే ముందు నిలవాలని ఆకాంక్షించారు. ఆ దిశగా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పరిశోధనలు సాగించాలని సూచించారు. విజయవాడలోని ఫార్చూన్‌ హోటల్‌లో నిర్వహించిన ‘‘ ఇండియా రైస్‌ కాంక్లేవ్‌’’లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, రాష్ట్ర వ్యవసాయ-ససహకార శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖలో అంతర్జాతీయ అగ్రిటెక్‌ సమ్మిట్‌ నిర్వహించామని చెప్పారు. విత్తన కొరత తీర్చేందుకు కర్నూలు జిల్లాలో మెగాసీడ్‌ పార్కుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ప్రపంచంలో మంచి సాంకేతికత ఎక్కడున్నా, అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలున్నా వాటిని దిగుమతి చేసుకుని అమలు చేసేందుకు ఇక్కడి రైతులు ఆసక్తిగా ఉన్నారన్నారు. వరి వంగడాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతికత వినియోగించడం, రైతులకు ఉత్తమ పద్ధతులను వివరించి ఆచరింపచేయడం ద్వారా పంజాబ్‌, చైనాను మించి దిగుబడులు సాధించవచ్చన్నారు.

గతంలో విత్తనాలు, విద్యుత్, పురుగుమందులు, ఎరువుల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవారని ఆ సమస్యల్ని తమ ప్రభుత్వం తొలినాళ్లలోనే అధిగమించిందని ఆయన చెప్పారు. బయోమెట్రిక్ విధానంలో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు పంపిణీ చేసిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని సీఎం తెలిపారు. వ్యవసాయంతో పాటు ఉద్యానం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక ఎక్స్‌ టెన్షన్ అధికారిని నియమించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. ఏపీలో ప్రతి మంగళ, బుధవారం ‘‘పొలం పిలుస్తోంది’’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలను రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహించి రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

 

loader