మీరు చదివింది నిజమే. నిజంగానే బర్గర్ ఖరీదు రూ.2లక్షలు.  అది మాములు బర్గర్ కాదు.. వాలంటైన్స్ డే స్పెషల్ బర్గర్. ఎంత వాలంటైన్స్ డే అయితే మాత్రం రూ.100 బర్గర్ .. రూ.2లక్షలకు అమ్ముతారా.. ? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును .. కాకపోతే.. ఆ బర్గర్ కి మరో ప్రత్యేకత ఉంది. దానిపై డైమండ్ ఉంగరం కూడా ఉంది. అందుకే అంత ఖరీదు. ఇంతకీ ఈ ఖరీదైన బర్గర్ ఎక్కడ అమ్ముతున్నారో తెలుసా..? యూఎస్‌లోని మస్సాచుసెట్స్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో.

అసలు విషయం ఏమిటంటే... త్వరలో వాలెంటైన్స్ డే రాబోతున్నది కదా. అందుకే.. ప్రేమికుల కోసం మంచి గిఫ్ట్ తయారు చేయాలనుకున్న ఆ రెస్టారెంట్ ఇలా వినూత్నంగా ఆలోచించింది. ఆ బర్గర్ తో పాటు గోల్డ్, డైమండ్‌తో చేసిన ఎంగేజ్‌మెంట్ రింగ్ కూడా ఇస్తారన్నమాట. అంతేకాదండోయ్.. బర్గర్ కి జతగా.. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇస్తారు. దీని ధర అమెరికన్ కరెన్సీలో 3వేల డాలర్లు కాగా.. మన కరెన్సీలో దాని ఖరీదు సమారు 2లక్షలు(1.9లక్షలు). అంత ఖరీదైన బర్గర్ ఎవరైనా కొంటారా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రేమికుల రోజున..  ఏ ప్రేమికులు డబ్బుల గురించి ఆలోచించరని.. కేవలం వినూత్నంగా గిఫ్ట్ ఇచ్చామా లేదా అన్న విషయంపైనే దృష్టిపెడతారని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బర్గర్ కావాలంటే.. 48గంటల ముందే ఆర్డర్ ఇవ్వాలి. అప్పుడే ఈ ఖరీదైన బర్గర్ వారి సొంతమౌతుంది.