మన్నార్ గుడిలో  ఉండే శశికళ చుట్టపట్టాలను కట్టకలిపి మన్నార్ గుడి మాఫియా అంటారు. ఇందులో 18 మంది ఉన్నారన్నవిషయం జయలలిత చనిపోయాక తెలిసింది.

కాలం మారినపుడు ఉద్యమాలు మారకపోతే, కుక్కమూతి పిందెలు పుడతాయనేందుకు తమిళనాడు ద్రవిడ పార్టీలు చక్కటి ఉదాహరణ. అక్కడ రెండుద్రవిడ పార్టీలే అధికారం ఛలాయిస్తున్నా, వాటిలో నాటి ద్రవిడ ఉద్యమ సారం పూర్తి గా ఎండి పోయింది. మొదట్లో తమిళనాడు పార్టీలు సమాజంలో ఉన్నకులాల విభజనకు అనుగుణంగా ఉండేవి. అట్టడుగుల వాళ్లంతా కాంగ్రెస్ బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేంగా ద్రవిడ సిద్ధాంతం కిందికి వచ్చారు. ఇలా వారిని ద్రవిడల పేరుతో ఏకం చేయడంలో ఇవి రామస్వామి (పెరియార్) విజయవంతమయ్యారు. ప్రత్యేక ద్రవిడ దేశం నినాదం కూడా ఇచ్చారు. ఈ నినాదంతో ద్రవిడ పార్టీ పుట్టినా, ప్ర్యతేక ద్రవిడ దేశం ముందుకు సాగ లేదు. దానితో ద్రవిడ పార్టీల ద్రావిడిజం ఎన్నికలకు, అధికారానికి పరిమితమయింది.

 కిందికులాల ద్రవిడభావన వల్ల బ్రాహ్మణ కాంగ్రెస్ ను వాళ్లు తమిళనాడు నుంచి తరిమేయగలిగారు. బిజెపి దరిదాపుల్లోకి రాకుండాజాగ్రత్తపడ్డారు. అయితే, ఈ పార్టీలలో కూడా ద్రవిడ సెంటిమెంటు మెల్లిగా మెల్లిగా ఇంకిపోవడం మొదలయింది. రెండు పార్టీలలో వ్యక్తులు ముఖ్యమయ్యారు. సంపాదన ముందుకొచ్చింది. దీనితో రెండు పార్టీలు ఎన్నికల్లో గెలించేందుకు ద్రవిడులనుంచే ఓట్లను నోట్లతో , కానుకలతో కొనడంమొదలుపెట్టారు. ఎఐడిఎంకె లో ద్రవిడతరం ఎంజి రామచంద్రన్ అంతమయితే,డిఎంకెలో ఇపుడు కరుణానిధితో ముగుస్తున్నది. ఈ ద్రవిడ భావం అంతమవుతున్నప్పటి గందరగోళమే ఇపుడు తమిళనాడులో కనిపిస్తుంది. ఇందులో పుట్టిన కుక్కమూతిపిందెల్లో శశికళ ఒకరు.

శశికళ ఎవరు?

పత్రికల వాళ్లు ఆమెను మన్నార్ గుడి మాఫియా రాణి అని పిలుస్తారు. వూరుమన్నార్ గుడి ఆమె సొంతవూరు. తిరువూరు జిల్లాలో కావేరి డెల్టాలో ఉంటుంది.

ఆమెసోదరులలో ఒకరు డాక్టరు. పేరు ధివహరన్. ఇంకా ముగ్గురుసోదరులతో ఆమెది ఉమ్మడి కుటుంబం. ఆమె హోదా పెరిగో కొద్ది అయినోళ్ల కానోళ్లు ‘మా శశికళ ’ అమె చుట్టూ చేరి పోయెస్ గార్డెన్ లో మన్నార్ గుడి బెటాలియన్ అయికూర్చున్నారు.

మన్నార్ గుడిలో ఉండే అమె కుటుంబ సభ్యులను సమీప బంధువులను కట్టకలిపి మన్నార్ గుడి మాఫియా అంటారు. ఇందులో 18 మంది ఉన్నారన్నవిషయం జయలలిత చనిపోయాక తెలిసింది.

జయలలిత మృత దేహం ప్రజల నివాళి కోసం రాజాజీ హాల్లో ఉంచినపుడు అమె శవపెటిక చుట్టు మొదటి వరసలో ఉన్నవారంతా శశికళ కుటుంబ సభ్యులే. శవపేటిక దగ్గరికి మరొక రు రాకుండా ఈగ్యాంగ్ వలయంగా ఏర్పదిందని చెబుతారు. ఎంచితే వారు 18 ఉన్నారని తేలింది. ఈమాఫియా కమాండర్ ఎం. నటరాజన్, శశికల భర్త. అప్పటినుంచి ఈ మాఫియాకు జి-18 అనే పేరుకూడా వచ్చింది

శశికళ , జయలలిత సన్నిహితంగా ఉన్నరోజులలో వీరంతా ప్రభుత్వంలో బాగా పట్టు సంపాదించారు.కీలకమయిన పదవుల్లోకి కూడా వెళ్లిపోయారు.బదిలీలు, పైరవీలు, లైసెన్సు లు ఇప్పించి బాగా బలిశారని చెబుతారు. ఐఎఎస్ లను కూడా బదిలీచేసే శక్తి వీరికి ఉండేదని అది జయలలిత దాకా వచ్చాకే వ్యవహారం బెడిసింది.

ఈ మాఫియాను తాను సొంతంగా ఏమీ చేయలేని స్థితిలో పన్నీర్ సెల్వం ఉన్నాడు.

 జయను శశికళ కలయిక ఎలా జరిగింది

1980లో శశికళ జయలలితను కలుసుకున్నారు. ఒకవీడియో కంపెనీ వోనర్ గా పరిచయం చేసుకుని జయలలిత కార్యక్రమాలను కవర్ చేసేందుకు అనుమతి కోరారు. జయలలితను వప్పించి,పోయోస్ గార్డెన్ లోని వేదనియలంలో ప్రవేశించే పాస్ సంపాయించారు.

రోజూ ఏదో ఒక కార్య క్రమం పేరుతో వేద నిలయంలోకి రావడం పోవడం చేశారు. మృదు స్వభావంతో క్రమంగా జయలలిత మనసు చూరుగొన్నారు.1991లో జయలలిత ముఖ్యమంత్రి కాగానే, శశికళ మకాం ఏకంగా పోయెస్ గార్డెన్ కే మార్చేశారు. జయలలిత నెచ్చెలి అయ్యారు. అప్పటి నుంచే ఆమె చిన్నమ్మగా మారడం మొదలయింది.

 వారిద్దరు ఎంత సన్నిహితులయ్యారంటే, శశికళ మేనల్లుడు సుధాకరణ్ ను జయలలిత ఏకంగా దత్తత తీసుకున్నారు. 1995లో సుధాకరన్ పెళ్లి భారత దేశం కళ్లుచెదరిపోయేలా చేశారు. సుధాకరణ్ పెళ్లి చేసుకున్నదెవరినో కాదు, తమిళ హీరో శివాజీ గణేశన్ మనవరాలినే.

అయితే, ఈ పెళ్లి అమె కొంపముంచింది. పెళ్లి అయిపోయింది గాని అవినీతి మరకలంటుకున్నాయి. చనిపోయేదాకా కూడా అవిపోలేదు. సుధాకరన్ పెళ్లి అంతఘనంగా చేయడం మీద ఎదురయిన ప్రశ్నలకు జయలలిత సమాధానం చెప్పలేకపోయారు.చివరకు అదే దత్త పుత్రుని వదిలించుకోవలసి వచ్చింది.

అయితే శశికళ పట్టు మాత్రం సడలలేదు. 2000లో పార్టీలో పెద్ద తిరుగుబాటు మొదలయింది. ముగ్గురు సీనియర్ లీడర్లు- కరుప్పసామి పాండియన్, సెదపట్టి ఎస్ రగుపతి, ఆర్ ముత్తయ్య- పార్టీలో శశికళ పెత్తనం వ్యతిరేకించారు.అయితే, జయలలిత మారురూపమయిన శశికళ మీద తిరుగుబాటు చేసినందుకు పార్టీ నుంచి బహిష్కతులయ్యారు. ఇది శశికళను పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేని శక్తినిచేసింది.

 జయలలిత ఉన్న కేసులన్నింటిలో శశికళ ముద్దాయి. అక్రమ ఆస్తుల కేసులో ఆమెకు నాలుగు సంవత్సరాల శిక్ష కూడా పడిది.

అయితే, సీనియర్ అధికారులను కూడా బదిలీచేయిస్తున్నారని, ప్రభుత్వంలో ఆమెకుటుంబం జోక్యం ఎక్కువ అవుతుందని ఆరోపణలు శశికళను వేదనిలయం నంచి తరిమేసే దాకా వెళ్లాయి.

మధ్యలో మళ్లీ రాజీ కుదిరినా, మన్నార్ గుడి మాఫియాను పూర్తిగా ఆమె క్షమించలేక పోయారు. 2011లో శశికళ మార్బలాన్ని మొత్తం తరిమేశారు. అయితే,కొంతకాలం తర్వాత శశికళను తిరిగి దరిచేర్చుకున్నారు, ఒక కండిషన్ మీద. ఆమె కుటుంబసభ్యులెవరూ పోయేస్ గార్డన్ పరిసరాల్లో కనిపించరాదనేది కండిషన్. దీనికి వప్పుకున్నాకే అమెకు వేదనిలయంలోకి పున: ప్రవేశం దొరికింది. శశికళ పరివారం మీద జయలకు ఎంత కోపం ఉందంటే, 2011-16 మధ్య కొంత మంది మన్నార్ గుడి మాఫియా సభ్యులను ఆమె జైలుకు కూడా పంపించారు. తర్వాత విడుదలయివచ్చారనేది వేరే విషయం.

అయితే జయలలిత ఆరోగ్యం క్షీణించగానే, ఈ మాఫియా మళ్లీ రంగం మీద కు వచ్చింది. జయలలిత చనిపోయాక పార్టీ మీద పట్టుకూడా సంపాదించింది.