పూణే: శాకాహారం ఆర్డర్ చేస్తే మాంసాహారం సరఫరా చేసినందుకు పూణేకు చెందిన ఆహార సరఫరా సంస్థ జోమాటోకు, హోటల్ కు వినియోగదారుల కోర్టు రూ. 55 వేల జరిమానా విధించింది. మీడియా కథనాల ప్రకారం... పూణేకు చెందిన న్యాయవాది షణ్ముఖ్ దేశ్ ముఖ్ కు రెండుసార్లు మాంసాహారం సరఫరా చేశారు. 

జరిమానాను 45 రోజుల లోగా చెల్లించాలని కోర్టు జోమాటోను ఆదేశించింది. న్యాయవాది పనీర్ బట్టర్ మసాలా ఆర్డర్ చేయగా జోమాటో బట్టర్ చికెన్ ను సరఫరా చేసింది. 

రెండు ఆహార పదార్థాలు కూడా చూడడానికి ఒకే మాదిరిగా ఉండడంతో అతను గుర్తించలేదు. దాంతో జోమాటో డెలివర్ చేసిన బట్టర్ చికెన్ ను తిన్నాడు. సొమ్మును తిరిగి ఇచ్చినప్పటికీ తమ పరువుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో న్యాయవాది ఫిర్యాదు చేశాడని జోమాటో చెప్పింది. 

ఒక్క ఆహార పదార్థాన్ని ఆర్డర్ చేస్తే మరో ఆహార పదార్థాన్ని ఇచ్చింది హోటల్ అని, అందువల్ల హోటల్ దే తప్పని జోమాటో ప్రతినిధులు వినియోగదారుల కోర్టుకు తెలిపారు. తమ తప్పును హోటల్ కూడా అంగీకరించింది. జోమాటో, హోటల్ కలిసి రూ. 50 వేలు తప్పుడు ఆర్డర్ డెలివర్ చేసినందుకు చెల్లించాలని, మిగతా మొత్తాన్ని మానసిక వేదనకు గురి చేసినందుకు చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది.