ప్రధానమంత్రి మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. దేని గురించి అంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వైఫల్యాలు, అవినీతిపై జోక్యం చేసుకుని దర్యాప్తు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆమె విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన ఘటన చర్చనీయాంశమైంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై రాజకీయ దుమారం రేగింది. ఎన్నికలకు ముందే ఇలా జరగడంతో అధికార పార్టీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎన్నికల్లో మైలేజీ కోసం ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా.. అసలు పోటీలోనే లేని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో వైఫల్యాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు హైదరాబాద్‌లో బీసీల సింహ గర్జన సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పర్యటనలో ఉండగా ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ రాయడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, అవినీతిపై జోక్యం చేసుకోవాలని, వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆమె ప్రధాని మోడీని కోరారు.
Also Read: telangana assembly election 2023 : జగిత్యాలలో నామినేషన్ దాఖలు చేసిన 82 ఏళ్ల వృద్ధురాలు..
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో వైఫల్యాలు బయటపడటంపై యావత్తు తెలంగాణ విస్మయపోతున్నదని, తాను కేవలం ఒక పార్టీ తరఫున కాకుండా తెలంగాణ ప్రజలందరి గొంతుకగా ఈ మొర చేస్తున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు. ఇంతటి ఆందోళనలు జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటంపైనా తాము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. లక్షల కోట్ల ప్రజా ధనం ఈ ప్రాజెక్టు రూపంలో వృధా కావడంపై తెలంగాణ సమాజం బాధతో ఉన్నదని తెలిపారు. ఈ ప్రాజెక్టును కేవలం అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకోవడానికి కట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి బీజేపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు లేఖలో రాశారు.