చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించడంతో దేశంలోని పలు రాష్ట్రాల రాజకీయ నేతల దృష్టి ప్రశాంత్ కిశోర్ పై పడింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. జగన్ విజయం తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీతో ప్రశాంత్ కిశోర్ ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి పళని సామి కూడా ప్రశాంత్ కిశోర్ ను సంప్రదించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. లోకసభ ఎన్నికల్లో అన్నాడియంకె విఫలం కావడంతో పళని సామి తన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకోవాలనే ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. అయితే, తాజాగా తమిళనాడులోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, సినీ నటుడు కమల్ హాసన్ కూడా ప్రశాంత్ కిశోర్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవలి ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఏం చేయాలనే విషయంపై కమల్ హాసన్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో రాజకీయ నిపుణుడు ప్రశాంత్‌ కిషోర్‌ తో ఆయన సమావేశమైనట్లు తెలుస్తోంది. 

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 2021లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌తో సుమారు రెండు గంటల పాటు కమల్ హాసన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది