గణేష్ నిమజ్జనం ఊరేగింపులో బురఖాతో యువకుడి డ్యాన్స్.. వీడియో వైరల్ కావడంతో అరెస్టు చేసిన పోలీసులు
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడు బురఖా వేసుకొని డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఆ యవకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడు సరదాగా చేసిన పని ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరిగేలా చేసింది. ఆ యువకుడు తన స్నేహితులతో డ్యాన్స్ చేసేందుకు బురఖా వేసుకొని వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో అతడిపై పోలీసు కేసు నమోదు అయ్యింది.
వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని వేలూరు ప్రాంతంలో ఈ నెల 21వ తేదీన గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. ఇందులో విరుతంపట్టుకు చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి బురఖా ధరించి డ్యాన్స్ చేశాడు. అతడితో కలిసి పలువురు స్నేహితులు కూడా డ్యాన్స్ చేశారు. దీనిని అక్కడున్న పలువురు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది.
అయితే దీనిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడు వివరాలు గుర్తించారు. అనంతరం అరెస్టు చేశారు.రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినందుకే అతడిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇందులో మరి కొందరి ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు.