మధ్యప్రదేశ్‌లోని ఓ ఐటీ కంపెనీ ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వారి వర్క్ టైమ్ అవ్వగానే సిస్టమ్ ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అవుతుంది. మీ షిప్ట్ టైమ్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్లిపోండి అనే వార్నింగ్ మెస్సేజీ కూడా చూపిస్తుందని ఆ కంపెనీ హెచ్ఆర్ లింక్‌డ్ ఇన్‌లో పోస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఉద్యోగి షిప్ట్ టైమ్ పూర్తవ్వగానే వారు వాడుతున్న కంప్యూటర్ ఆటోమేటిగ్‌గా షట్ డౌన్ అయిపోతుంది. దాని మానిటర్ పై ఓ వార్నింగ్ మెస్సేజీ డిస్‌ప్లే అవుతుంది. ‘మీ షిప్ట్ టైమ్ పూర్తయింది. మరో పది నిమిషాల్లో ఈ సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. కాబట్టి, ఇంటికి వెళ్లిపోండి’ అని ఓ వార్నింగ్ మెస్సేజీ కూడా చూపిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ ఐటీ కంపెనీ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతున్నది. లింక్‌డ్ ఇన్‌లో ఈ స్టోరీని పోస్టు చేశారు.
ఇండోర్‌లోని సాఫ్ట్ గ్రిడ్ కంప్యూటర్స్ కంపెనీలో హెచ్ఆర్‌గా ఉన్న తన్వి ఖండేల్వాల్ ఇందుకు సంబంధించిన ఓ పోస్టు లింక్‌డ్ ఇన్‌లో షేర్ చేశారు. ఆ కంపెనీ ఫ్లెక్సిబుల్, ఎంజాయ్ చేసే వర్క్ ఎన్విరాన్‌మెంట్‌ను మెయింటెయిన్ చేస్తున్నదని ఆ హెచ్ఆర్ వివరించారు. సిస్టమ్ మానిటర్ పై వచ్చే వార్నింగ్ మెస్సేజీ ఫొటోలనూ పోస్టు చేశారు.
‘వార్నింగ్!! మీ షిప్ట్ టైమ్ అయిపోయింది. ఆఫీసు సిస్టమ్ మరో పది నిమిషాల్లో షట్ డౌన్ అవుతుంది. కాబట్టి, దయచేసి ఇంటికి వెళ్లండి’ అని మానిటర్ పై వార్నింగ్ మెస్సేజీ కనిపిస్తున్నది.
ఈ పోస్టు క్యాప్షన్‌లో సదరు హెచ్ఆర్ ఇలా రాసుకొచ్చారు. ‘ఇది ప్రమోషనల్ లేదా కల్పిత పోస్టు కాదు. ఇది మా ఆఫీసులోని వాస్తవికత. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మా యాజమాన్యం మద్దతు ఇస్తుంది. అందుకే బిజినెస్ అవర్స్ అయిపోగానే ఓ వార్నింగ్ మెస్సేజీని రిమైండర్ గా సెట్ చేశారు. ఆ తర్వాత తమ డెస్క్ టాప్ లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఫోన్ కాల్స్ ఉండవు. మెయిల్స్ ఉండవు. ఇది అద్భుతంగా ఉంది కదూ? ఇలాంటి వాతావరణంలో మీరు పని చేస్తున్నప్పుడు మీ మూడ్ ఇంప్రూవ్ చేయడానికి మీకు మండే మోటివేషన్, ఫన్ ఫ్రైడేల అవసరం ఉండదు’ అని పేర్కొన్నారు.
ఈ పోస్టు పై చాలా మంది యూజర్లు రియాక్ట్ అయ్యారు. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విధానాన్ని పొగిడారు. అన్ని కంపెనీల యాజమాన్యాలు ఇలా ఆలోచించాలని భావించారు. కాగా, కొందరేమో ఇది సరికాదని వివరించారు.ఒక రోజు చేసిన పని మొత్తం చివరి దశకు వచ్చాక సిస్టమ్ ఇలా ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతే.. తల తిరిగిపోతుందని, తర్వాతి రోజు మళ్లీ చేసిన పనే చేయాల్సి రావడం ఫ్రస్ట్రేషన్‌లాగే ఉంటుందని పేర్కొన్నారు.
