2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షాలను ఆలస్యం చేయక ఒక తాటి మీదికి తేవాలని కోరారు. ఇందుకోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. కాగా, తప్పకుండా ప్రతిపక్షాలు ఏకమవుతాయని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అయితే, ప్రేమలోనూ ఒక్కోసారి ఐ లవ్ యూ అని ఫస్ట్ ఎవరు చెప్పాలి? అనే చోట మీమాంస ఏర్పడుతుందని, ఇక్కడా అంతే ఎవరు ముందు ప్రపోజ్ చేయాలి? అని ఉంటుందని వివరించారు.
పాట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాలన్నీ ఏకం కావాలనే అభిప్రాలు కొన్ని పార్టీల నుంచి బయటపడ్డాయి. బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, బిహార్ డిప్యూటీ సీఎం ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ ఈ అంశంలో కాంగ్రెస్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదికి తేవాలని వారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను కోరారు. అందుకు సల్మాన్ ఖుర్షీద్ ఆసక్తికరమైన రీతిలో సమాధానం చెప్పారు. త్వరలోనే ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతాయని చెబుతూనే.. కానీ, ఎవరు ముందు ఐ లవ్ యూ చెప్పాలి? అనే మీమాంస ఉంటుందని అన్నారు.
‘మీరు అనుకుంటున్నట్టే కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాల ఐక్యతను కోరుకుంటున్నది. కానీ, కొన్ని సార్లు ప్రేమలోనూ కొన్ని అవాంతరాలు వస్తాయి. ముందుగా ఐ లవ్ యూ ఎవరు చెప్పాలి? అనే ఓ మీమాంసం ఉంటుంది. ప్రతిపక్షాల ఐక్యత అంశం కూడా అలాగే ఉన్నది. ప్రతిపక్షాల ఐక్యత త్వరలోనే ఏర్పడి తీరుతుంది’ అని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.
Also Read: రూ. 1800 క్యాష్ గురించి దంపతుల మధ్య గొడవ.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. హైదరాబాద్‌లో ఘటన
అంతకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. బీజేపీని ఎదుర్కో వడానికి కాంగ్రెస్ ముందుకు రావాలని కోరారు. సీపీఐఎంఎల్ లిబరేషన్ పాట్నాలో నిర్వహించిన ఓ సదస్సులో ాయన మాట్లాడారు. ‘ప్రతిపక్షాలను ఏకతాటి మీదికి తీసుకురావడంలో కాంగ్రెస్ జాప్యం చేయవద్దు. మేం అందుకోసం ఎదురుచూస్తున్నాం. మేం ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కలిశాం’ అని వివరించారు. ‘ఇది కాంగ్రెస్‌కు మీ ద్వారా చేస్తున్న విజ్ఞప్తి’ అని నితీశ్ కుమార్.. సల్మాన్ ఖుర్షీద్‌ను ఉద్దేశిస్తూ అన్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చునని అన్నారు. బిహార్‌లో ప్రతిపక్షాలు అన్నీ కలిసి కట్టు గానే ఉన్నాయని వివరించారు.
