ఓ వ్యక్తి హైటెక్ బెగ్గింగ్ కు తెరలేపాడు. ఏకంగా విమానాశ్రయంలోనే అడుక్కోవడం మొదలుపెట్టాడు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అతడిని పోలీసులకు పట్టించారు. 

బెంగళూరు : రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లు, గుడిమెట్ల మీద.. ట్రాఫిక్ కూడళ్ల దగ్గర భిక్షాటన చేసుకునేవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అయితే.. నడుస్తున్న ట్రైన్లు, బస్సుల్లో కూడా బిచ్చమెత్తడం గమనిస్తుంటాం. అయితే, ఓ యువకుడు మాత్రం దీనికి ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఎయిర్పోర్టులోనే భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. ప్రయాణికుల వద్ద డబ్బులు అడుక్కుంటుండగా గమనించిన విమానాశ్రయ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు ఈ మేరకు తెలియజేశారు..

విగ్నేష్ అనే 27 ఏళ్ల యువకుడు చెన్నై వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. దీనికోసం ఎయిర్పోర్టులోకి ప్రవేశించాడు. అయితే, అతని ఉద్దేశం చెన్నై వెళ్లడం కాదని... ఎయిర్పోర్టులో.. భిక్షాటన చేయడమని తర్వాత తెలిసింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన సదరు విగ్నేష్… అక్కడున్న ప్రయాణికుల దగ్గరికి వెళ్లి డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, వైద్యం కొరకు సహాయం చేయాలంటూ కథలల్లుతూ వారిని డబ్బు సహాయం అడుగుతున్నాడు.

మండుటెండలో 7 కి.మీ. నడిచి వెళ్లిన నిండు గర్భిణి, మృతి...

అంతేకాదు ప్యాసింజర్లను ఒక్కొక్కరిని రూ. 7వేలు, రూ.10వేలు ఇవ్వమంటూ వెంటపడడం మొదలుపెట్టాడు. కాసేపటి తరువాత ప్రయాణికులకు అనుమానం వచ్చింది. విమానాశ్రయంలో ఇలాంటివి ఎప్పుడూ గమనించలేదని వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని మీద 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

అంతేకాదు, ఆ యువకుడి దగ్గర 26 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వాటిలో 24 పనిచేస్తున్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఇలాంటి కార్యకలాపాలు చాలా అరుదుగా జరుగుతుంటాయని.. అయితే ఇదంతా ఓ ముఠాపని అయి ఉండచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విగ్నేష్ కూడా అలాంటి ముఠాకు చెందిన సభ్యుడు అయి ఉండొచ్చని అంటున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటన జరిగింది. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది.