ఆస్పత్రికి వెళ్లడానికి ఏడు కిలోమీటర్లు మండుటెండలో నడిచి వెళ్లిన గర్బిణి వడదెబ్బ తగలడంతో మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. 

మహారాష్ట్ర : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది. మండుటెండలో ఓ నిండుగర్భిణి.. 7 కి.మీలు నడిచి వెళ్లింది. ఆస్పత్రికి వెళ్లిరావడానికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో నడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో వడదెబ్బ తగిలి మృతి చెందింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. గిరిజన గ్రామమైన ఓసర్ వీరాకు చెందిన సోనాలి వాఘట్ (29) తొమ్మిది నెలల గర్భిణి.

నెలవారీ ఆరోగ్య పరీక్షల కోసం తవాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నడిచి వెళ్లింది. ఆ తరువాత అక్కడినుంచి ఇంటికి నడిచి వచ్చింది. అలా మొత్తం 7 కి.మీ.లు మండుటెండలో నడిచింది. దీంతో వడదెబ్బ తగిలింది. సాయంత్నానికి సొనాలి తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఆమె అస్వస్థత కారణంగా కడుపులోని శిశుకు కూడా ప్రాణాలు విడిచింది. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కేంద్రంలో ఇలాగే ఓ గర్భిణి మృతి చెందింది. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టప్రకారం నేరమని తెలిసినా ఓ వైద్యురాలు.. ఓ మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే కాకుండా పుట్టబోయేది ఆడపిల్ల అని చెబుతూ.. అబార్షన్ చేయించుకోమని సూచించింది. ఈ క్రమంలో అబార్షన్ వికటించడంతో గర్భిణి మృతి చెందింది. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రాణాలు అకాల మృత్యువాత పడ్డాయి.

భగవద్గీత చదివి దొంగలో మార్పు.. 9 ఏళ్ల క్రితం కొట్టేసిన శ్రీకృష్ణుడి ఆభరణాలు వెనక్కి, క్షమాపణలు కోరుతూ లేఖ

గర్భస్థ పిండం లింగ నిర్ధారణ చేసి ఆడపిల్ల పుట్టబోతుందని నిర్ధారించింది ఓ వైద్యురాలు. ఆ తర్వాత అబార్షన్ చేసే క్రమంలో గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. అనంతపురం నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. ఈ ప్రైవేటు వైద్యురాలి నిర్వాకంపై అనంతపురం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన హనుమంతు, కవిత (25) దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

కొడుకు కోసం మరోసారి గర్భం దాల్చింది కవిత. అయితే, ఈసారి కూడా కూతురు పుడితే ఎలా అనే భయంతో ముందుగానే.. గర్భంలో ఉంది ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. దీనికోసం అనంతపురం శ్రీనివాస్ నగర్ లో ఉన్న రూత్ క్లినిక్కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు గర్భస్థ పరీక్షలు చేసిన వైద్యురాలు లక్ష్మీకాంతమ్మ.. గర్భంలో ఉన్నది ఆడపిల్లగా తేల్చింది. అబార్షన్ చేయించుకోమంటూ సలహా ఇచ్చింది.

దీనికి దంపతులు అంగీకరించారు. ఆదివారం అబార్షన్ కు అన్ని ఏర్పాట్లు చేసి.. అబార్షన్ చేశారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఇంటికి పంపించారు. మర్నాడు సోమవారం నాడు కవిత పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అబార్షన్ చేసిన రూత్ క్లినిక్కి తీసుకువచ్చారు. అయితే, ఆ సమయంలో డాక్టర్ లక్ష్మీకాంతమ్మ అక్కడ లేదు. దీంతో ఆమెను వెంటనే సిబ్బంది ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకెళ్లమంటూ సూచించారు. అక్కడ కవితను పరీక్షించిన వైద్యంలో ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. షాక్ అయిన కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ లక్ష్మీకాంతమ్మ మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.