కులం, లింగ వివక్ష బలమైన గొంతెత్తిన యువకెరటం, యువ పాత్రికేయురాలు స్నేహ బెల్సిన్ తన ప్రయాణాన్ని అర్థంతరంగా ముగించింది. 26 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తమిళనాట ఈ జాఢ్యాలపై విస్తారమైన చర్చను లేవదీసి ఒక మంచి మార్పునకు దోహదం చేయడంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించింది.
చెన్నై: జర్నలిస్టు, యాక్టివిస్ట్ స్నేహ బెల్సిన్(26) చెన్నైలో సోమవారం(ఆగస్టు 28)న తుదిశ్వాస విడిచారు. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో డిజిటల్, వీడియో టీమ్‌లో పని చేసిన ఆమె ప్రధానంగా కులం అడ్డుగోడలు, లింగ వివక్షపై విరుచుకుపడ్డారు. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ప్రారంభించిన నీలం కల్చరల్ సెంటర్ నిర్వహించే వెబ్ చానెల్ నీలం సోషల్‌లో ఆమె వీడియో సిరీస్‌లో ఒక సంచలనం. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆమె తమిళ సినిమా విడుదలై పార్ట్ 1 పై విమర్శనాత్మక వ్యాసం రాశారు. లైంగిక దాడి, అణగారిన వారిపై వేధింపుల చిత్రణ సంచలనంగా తీయడాన్ని ఆమె చర్చించారు.
కోయంబత్తూర్, నాగర్‌కాయిల్‌లో స్నేహ పెరిగారు. జర్నలిజం, ఫిలిం మేకింగ్‌లో ముంబయి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. విరివిగా పుస్తకాలు చదవడం, అనువాదం చేయడం, కవితలు, బ్లాగ్‌లలో కార్తుంబి కలం పేరుతో రాయడం చేశారు. మున్నురై, ఎన్నడ పాలిటిక్స్ పన్రింగా వంటి పొలిటికల్ సెటైర్‌లతో స్వల్ప సమయంలోనే విశేష ఆదరణ పొందారు. మానసిక ఆరోగ్యం గురించి ముఖ్యంగా బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి తరుచూ మాట్లాడేవారు.
షార్ట్ ఫిలిం పొలిటికల్ డ్రామా సావుందును స్నేహ డైరెక్ట్ చేశారు. పోలీసులు, అట్టడుగు సమూహ వ్యక్తికి మధ్య ఉండే పవర్ డైనమిక్స్‌ను ఆమె చిత్రించారు. నీలం సోషల్ చానెల్‌లో 2021లో ఈ షార్ట్ ఫిలిం విడుదలైంది.

ఫెమినిజాన్ని భిన్న కోణాల్లో విశ్లేషించి ఆంగ్లేతర ఆడియెన్స్‌లో చర్చను రేపారు. ఆమె కృషితో యథాతథ స్థితిలో లీనమైనవాళ్లు లింగ వివక్షపై అవగాహన పెంచుకుని చాలా మంది తమ ఆచరణను సవరించుకున్నారు. స్నేహ ఇటీవల పాత్రికేయ రచనల్లో ఎక్కువగా కులం, లింగ వివక్షకు సంబంధించి ఎక్కువగా చర్చించారు. ఆమె బలమైన దృక్పథంతో ఇండియన్ న్యూస్‌రూమలలో కుల వివక్షకు వ్యతిరేక అభిప్రాయాలు ప్రబలమయ్యాయి.
Also Read: ISRO: ఆదిత్య ఎల్-1 మిషన్‌ను సూర్యుడి మీదికి కాదు.. ఎల్-1 వద్దకు పంపిస్తారు.. అక్కడ ఏం జరుగుతుంది?
పిన్న వయసులోనే ఆమె మరణంపై నీలం కలత చెందినట్టు ట్వీట్ చేసింది. ఆమె మరణం తమను కంపింపజేసిందని, ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి అని పేర్కొంది. ఆమె అద్భుత వ్యక్తి అని, అంబెడ్కరైట్ గళాన్ని బలంగా వినిపించి కుల వ్యతిరేకత చర్చను సమర్థంగా నడిపే వ్యక్తిని తాము కోల్పోయామని తెలిపింది. జైభీమ్ స్నేహ అంటూ అధికారానికి ఎదురొడ్డి నిజం మాట్లాడినందుకు ధన్యవాదాలు అని పేర్కొంది. స్నేహ పట్ల తాము గర్వంగా ఉన్నామని వివరించింది.
ది న్యూస్ మినిట్ చేసిన ఓ ఇంటర్వ్యూలో ఆమె సామాజిక న్యాయం, కుల వ్యతిరేక రాజకీయాలు, ఆమె ప్రస్తుత భావజాలానికి చేరుకోవడానికి చేసిన ప్రయాణం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక ఉద్యమం నడపడానికి, లేదా అందులో పాలుపంచుకోవడానికి ఒంటరితనం అనివార్యం. కానీ, ఇది మనకు ఇంటిగ్రిటీని ఇస్తుంది. ఉదాహరణకు మీ మిసోజినిస్టిక్ ఫ్రెండ్స్‌తో లాయల్‌గా ఉంటే నీకు ఉద్యమంలో భాగంగా లేవన్నట్టే. కాబట్టి, నాకు నా ఐడియాలజీలే చాలా ముఖ్యం అని చెబుతాను. చాలా మజిలీల్లో, ఒక వింతైన విధానాల్లో మనకు ఒక విషయం బోధపడుతుంది. తమ రాజకీయాల పట్ల నిబద్ధతతో మెలిగే చాలా మంది ఒంటరి మనుషుల సమూహంలో నీవు ఒకరిని అని తెలియవస్తుంది’ అని స్నేహ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
