బాత్రూంలో కలిసి స్నానం చేస్తుండగా విషవాయువులు విడుదలై యువజంట ప్రాణాలు కోల్పోయిన విషాదం కర్ణాటకలో చోటుచేసుకుంది. 

బెంగళూరు : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న యువజంట జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. సహజీవనం చేస్తున్న వారిద్దరూ మరికొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే ఈ యువజంట ప్రాణాలు కోల్పోయి బాత్రూంలో నగ్నంగా పడి కనిపించారు.ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్(30), బెళగావి జిల్లాకు చెందిన సుధారాణి(22) ఓ హోటల్లో పనిచేస్తున్నారు. ఒకేదగ్గర పనిచేసే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు త్వరలోనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎలాగూ జీవితాంతం కలిసి జీవించాలనుకుంటున్నారు కాబట్టి పెళ్ళికి ముందే సహజీవనం చేస్తున్నారు. 

శనివారం రాత్రి చంద్రశేఖర్, సుధారాణి జంటగా స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లారు. వేడినీళ్ల కోసం గీజర్ ఉపయోగించగా అందులోంచి విషయవాయువులు వెలువడ్డాయి. బాత్రూం కిటికీలు కూడా మూసి వుండటంతో గీజర్ నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ బాత్రూంలో నిండిపోయింది. దీంతో ఈ వాయువులు పీల్చి యువజంట ఒక్కసారిగా స్ఫృహ కోల్పోయారు. వారిని కాపాడేవారు లేకపోవడంతో బాత్రూంలోనే అలాగే నగ్నంగా పడి ప్రాణాలు కోల్పోయారు. 

Read More తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కిన కూతురు..!

ఆదివారం చంద్రశేఖర్, సుధారాణి విధులకు హాజరుకాకపోవడం, పోన్ చేసినా ఎత్తకపోవడంతో తోటి సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు నివాసముండే ఇంటికెళ్లి తలుపుతట్టినా ఎవరూ తీయలేదు. కంగారుపడిపోయిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా బాత్రూంలో యువజంట మృతదేహాలు కనిపించాయి. 

వెంటనే పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువజంట ప్రమాదవశాత్తు మృతిచెందారా లేక మరేదైనా కారణముందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరికొద్దిరోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన జంట ఇలా పాడెఎక్కడం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తిచేసారు.