కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా కావాలంటే.. పెట్రోల్ ధరలు పెరుగుతాయి...కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..!
పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించగా.. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నాం కదా అంటూ సమాధానం చెప్పడం గమనార్హం
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ (petrol, Diesel) ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ పెట్రో ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ఇదే విషయమై కేంద్ర మంత్రిని మీడియా ప్రశ్నించగా.. ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వరి తేలి ఇటీవల ఓ కార్యక్రమంలలో చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించగా.. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నాం కదా అంటూ సమాధానం చెప్పడం గమనార్హం.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు పన్నులే కారణమని సెలవిచ్చిన కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి.. ఈ పెంచిన ధరలతో దేశ ప్రజలకు కొవిడ్ టీకాలు ఉచితంగా ఇస్తున్నామని తన అవివేకాన్ని బయటపెట్టుకున్నారు. కరోనా డోసు కోసం ప్రజల నుంచి ప్రభుత్వం డబ్బు వసూలు చేయడం లేదన్న విషయం తెలియదా? అంటూ సభకు హాజరైన వారిని ప్రశ్నించారు కూడా. అంతటితో ఆగకుండా హిమాలయన్ కంపెనీ తాగునీటి ధర లీటర్ పెట్రోల్ కంటే ఎక్కువే అని వ్యాఖ్యానించారు. ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
‘పెట్రోల్ ధర ఎక్కువ కాదు.. అందులో పన్ను కూడా ఉంటుంది... ప్యాక్ చేసిన మినరల్ వాటర్ ధర ఇంధనం కంటే ఎక్కువగా ఉంటుంది.. పెట్రోల్ ధర రూ.40 అయితే అసోం ప్రభుత్వం రూ. 28 విధిస్తుంది.. పెట్రోలియం మంత్రిత్వ శాఖ రూ.30 విధిస్తుంది.. దీంతో లీటర్ పెట్రోల్ రూ.98 అవుతుంది. కానీ మీరు హిమాలయ వాటర్ తాగితే ఒక బాటిల్ ధర రూ .100.. నీటి ఖర్చు ఎక్కువ.. ఇదేం నూనె కాదు’ అని కేంద్ర మంత్రి అన్నారు.
‘ఇంధన ధరలు ఎక్కువగా లేవు.. కానీ పన్ను కూడా తోడయ్యింది.. తప్పనిసరిగా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలంటే డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? మీరు డబ్బులు ఇవ్వరు కదా.. అందుకే పన్నుల రూపంలో సేకరిస్తున్నాం’ అని అన్నారు. రాజస్థాన్‌లో పెట్రోల్ ధర అధికంగా ఉందని, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ గరిష్ఠంగా విధిస్తోందని అన్నారు. మేము ఒక వేళ ధర తగ్గించినా వారు మాత్రం అదే కొనసాగిస్తారని మంత్రి ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల కర్ణాకటకు చెందిన ఓ మంత్రి కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల మహిళలు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారని, అద్దె గర్భం కోరుకుంటున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలుు తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదం ముగియక ముందే.. తాజాగా. కేంద్ర మంత్రి రామేశ్వరి తేలి చేసిన కామెంట్స్ మరింత చర్చనీయాంశమయ్యాయి. కరోనా వ్యాక్సిన్ కోసమే.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నామంటూ ఆయన చెప్పిన మాటలు.. అధికార పార్టీని ఇరకాటంలో పడేశాయి. మరి దీనిపై ఆయన ఎలాంటి వివారణ ఇవ్వనున్నారో చూడాలి.