డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని అవకాశాలను వినియోగిస్తోంది. ఇప్పటికే బ్రాండ్ ప్రమోషన్‌తో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను చేపట్టింది.

తాజాగా యూఐడీఏఐ ఆధ్వర్యంలో ఎంఆధార్ యాప్‌ను 2017లో రూపొందించింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులు తమ ఆధార్ డేటా తస్కరించకుండా ఉండటానికి ఆధార్ ప్రొఫైల్ కి లాక్ వేయవచ్చు.

తాజాగా మరో ఫీచర్‌ను ఎంఆధార్ వినియోగదారుల కోసం యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంఆధార్ యాప్‌లో మరో ఐదుగురి ఆధార్ కార్డు ప్రొఫైల్‌లను జత చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి యూఐడీఏఐ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

గతంలో ఎంఆధార్ యాప్‌లో గరిష్టంగా మూడు ప్రొఫైల్‌లను చేర్చే అవకాశం ఉండేది. ఇప్పడు ఐదు ప్రొఫైల్ జత చేసుకోవచ్చు. ఆధార్‌కు సంబంధించిన ఏదైనా సేవను ఆధార్ లాక్/అన్‌లాక్, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, విఐడి జెనరేటర్, ఇకెవైసి మొదలైన వాటిని ఎంఆధార్ మీ మొబైల్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు.

మీరు ప్రతి ప్రొఫైల్‌ను జతచేయాలి అనుకున్నప్పుడు ఆధార్ నెంబర్ ధృవీకరించడం కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ యాప్‌ వినియోగదారుల పేరు, పుట్టిన తేదీ, లింగం మరియు చిరునామా, ఫోటో, ఆధార్ నంబర్ లింక్‌లను కలిగి ఉంటుంది. ఎం ఆధార్ ద్వారా వినియోగదారులు వారి ప్రొఫైల్‌ డేటాను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవచ్చు.