Yogi Adityanath's oath ceremony: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం రోజున రెండో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటుగా.. ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్ హాజరుకానున్నారు.
Yogi Adityanath's oath ceremony: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. శుక్రవారం (మార్చి 25) సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానున్నారు.
PTI నివేదిక ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా, సంజీవ్ గోయంకా, ఎన్ చంద్రశేఖర్ లకు కూడా ఆహ్వాన పత్రికలు అందాయి. వీరితో పాటు మరో 60 మంది ఇతర వ్యాపార దిగ్గజాలకు ఆహ్వానాలు పంపించినట్టు తెలుస్తుంది. యోగా గురు బాబా రామ్‌దేవ్, 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఆహ్వానం పొందిన వారిలో ఉన్నారు.
వరుసగా రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణ స్వీకరం చేస్తున్న యోగి ఆదిత్యనాథ.. అయోధ్య, మధుర, వారణాసికి చెందిన 50 మందికి పైగా మహిళకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపినట్లు వార్తా సంస్థ నివేదించింది. అలాగే.. 13 అఖాడాల ప్రతినిధులు రానున్నారు. మొత్తంమీద 20 వేల మంది ప్రమాణస్వీకారానికి రానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో బీజేపీ అభిమానగణం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో దాదాపు 37 ఏళ్ల తర్వాత.. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకుని తిరిగి సీఎం పదవిని చేపడుతున్న ఘనత యోగి ఆదిత్యానాథ్‌కు దక్కింది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో 255 సీట్లు గెల్చుకుని, 41.29 శాతం ఓటింగ్ షేర్ దక్కించుకుంది బీజేపీ.
ఇదిలా ఉంటే.. కశ్మీర్ లోయలోని పండిట్ల దీనగాధల్ని తెలిపే విధంగా రూపొందించిన `ది కశ్మీర్ ఫైల్స్` సినిమా..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విజవంతంగా ప్రదర్శించబడుతుంది. కలెక్షన్స్ లో ఇప్పటికే రూ.200 కోట్ల మెయిలురాయిని దాటిన “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రం..తక్కువ సమయంలో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.
