మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తినడంపై ఆంక్షలేమీ లేవని, తాను స్వయంగా బీఫ్ తింటానని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2వ తేదీన కౌంటింగ్ ఉన్నది. 

గువహతి: ఈ నెల 27న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మేఘాలయ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో గొడ్డు మాంసం తినడంపై ఆంక్షలేమీ లేవని అన్నారు. అంతేకాదు,తాను స్వయంగా బీఫ్ తింటారని వెల్లడించారు. 

ఎర్నెస్ట్ మావ్రీ, ఏఎన్ఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వేరే రాష్ట్రాలు ప్రవేశపెట్టుకున్న తీర్మానాలపై ప్రకటన చేయను గానీ, మేఘాలయయలతో మేమంతా బీఫ్ తింటాం. మా తిండిపై ఆంక్షలేమీ లేవు. ఔను.. నేను కూడా బీఫ్ తింటాను. మేఘాలయాలో బీఫ్ పై బ్యాన్ లేదు. బీఫ్ తినడం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగం. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇండియాలోనూ అలాంటి రూల్ ఏమీ లేదు. కొన్ని రాష్ట్రాలు కొన్ని చట్టాలను తెచ్చుకున్నాయి. మేఘాలయాలో మాత్రం వధశాలలు ఉన్నాయి. ఎవరైనా గోవును, పందిని తీసుకెళ్లతారు.. దాన్ని మార్కెట్‌లోకి తెచ్చుకుంటారు. ఇది చాలా శుద్ధమైనది. అందుకే ప్రజలు దీన్ని తినడం అలవాటు చేసుకున్నారు’ అని వివరణ ఇచ్చారు.

Also Read: 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది.. 100 మంది మోడీలు, అమిత్ షాలు వచ్చినా సరే: మల్లికార్జున్ ఖర్గే

అసోం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు పశువుల అమ్మకాలు, రవాణా, వధపై నియంత్రణ తేవడానికి బిల్ పాస్ చేశాయి. హిందువు ప్రాబల్య ప్రాంతాల్లో బీఫ్ తినడంపై ఆంక్షలు విధించాలని ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ముఖంగా పేర్కొనే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అప్పీల్ చేశారు. 

బీజేపీ క్రిస్టియన్లకు వ్యతిరేక పార్టీ అనే ఆరోపణలనూ మావ్రీ ఖండించారు. అలాంటిదేమీ లేదని, అది ప్రత్యర్థి పార్టీలు చేసే దుష్ప్రచారం అని పేర్కొన్నారు. ‘దేశంలో ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నది. ఎక్కడైనా చర్చిని టార్గెట్ చేసుకుని ధ్వంసం చేసిన దాఖలాలు ఉన్నాయా? ఈ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రత్యర్థులవే. బీజేపీ క్రైస్తవ వ్యతిరేకి అనే దుష్ప్రచారం కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే చేస్తున్నాయి. మేఘాలయ క్రైస్తవులు అధికంగా ఉండే రాష్ట్రం. ఇక్కడ ప్రతి ఒక్కరూ చర్చికి వెళ్లుతారు’ అని తెలిపారు.