ఎస్ బ్యాంక్ పౌండర్, సీఈఓ రాణా కపూర్ ను ఈడీ అధికారులు ఆదివారం నాడు ఉదయం అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్టుగా ఈడీ ప్రకటించింది.

ఎస్ బ్యాంకు సీఈఓ రాణాకపూర్ ఇంట్లో ఈడీ అధికారులు శనివారం ఉదయం నుండి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాణాకపూర్ పై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

Also read:యెస్ బ్యాంకు వ్యవస్థపకుడి ఇంట్లో ఈడీ తనిఖీలు... లావాదేవీల్లో అవకతవకలు...కేసు నమోదు

ఇదే ఆరోపణలపై ఆదివారం నాడు ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ఆర్బీఐ విశ్వప్రయత్నాలే చేస్తుంది.బ్యాంకుపై ఏప్రిల్ మూడో తేదీ వరకు మారటోరియం బండ పడింది. గురువారం రాత్రి భారతీయ రిజర్వు బ్యాంక్  జారీ చేసింది. 

ఖాతాదారులు నెలకు రూ.50 వేలు మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు విత్ డ్రాయల్‌కు అనుమతినిచ్చింది. సెంట్రల్‌ బ్యాంక్‌.. నగదు ఉపసంహరణలపైనా పరిమితులు పెట్టింది. ఖాతాదారులు నెలకు రూ.50 వేలకు మించి తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి.  

మరోవైపు బ్యాంకు బోర్డును రద్దు చేసి.. అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్బీఐ మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. బ్యాంకుకు విశ్వసనీయమైన పునర్జీవ ప్రణాళిక అంటూ ఏదీ లేక పోవడంతో ప్రజా ప్రయోజనాలు, బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఒక నిర్ణయానికి వచ్చింది. 

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని 45 సెక్షన్ కింద యస్ బ్యాంకుపై మారటోరియం విధించాలని కేంద్రానికి సూచించాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. 

అయితే, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రైవేట్‌ రంగ బ్యాంకు యెస్‌ బ్యాంక్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ, మరికొన్ని ఆర్థిక సంస్థలు ఊపిరిలూదనున్నాయి. యెస్‌ బ్యాంక్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కూటమికి అనుమతి లభించించింది.