యెస్ బ్యాంకు వ్యవస్థపకుడి ఇంట్లో ఈడీ తనిఖీలు... లావాదేవీల్లో అవకతవకలు...కేసు నమోదు
యెస్ బ్యాంకు ప్రమోటర్ రాణా కపూర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. 13 నెలలుగా తాను బ్యాంక్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని చెబుతున్నా.. అంతకుముందు జరిగిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆర్బీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించాయి. తాజాగా రాణా కపూర్ నివాసంలో తనిఖీలు చేసిన ఈడీ.. ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
ముంబై: యెస్ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మారటోరియం విధించిన నేపథ్యంలో సదరు బ్యాంకు ఫౌండర్ రాణా కపూర్ ఇంటిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు జరిపింది. శుక్రవారం ముంబైలోని ఆయన ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు ఇంటిని తనిఖీ చేశారు. ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు.
రాణా కపూర్ తోపాటు మరికొంత మంది యెస్ బ్యాంక్ అధికారులపై అక్రమ నగదు చలామణి ఆరోపణలున్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థకు బ్యాంకు ఇచ్చిన రుణాలు మొండి బాకీలుగా మారాయి.
మరో కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ రాణా కపూర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా వారి నుంచి కొంత సొమ్ము లబ్ది పొందారని అభియోగాలు ఉన్నాయి.
అలా లబ్ది పొందిన సొమ్ము రాణా కపూర్ సతీమణి ఖాతాలోకి చేరినట్లు ఆధారాలు ఉన్నట్లు తెలుస్తున్నది. యెస్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి దారి తీసిన మరికొన్ని అవకతవకల్లోనూ రాణా కపూర్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
also read యెస్ బ్యాంక్...అంతా అస్తవ్యస్తం...రూ.3.28 లక్షల కోట్లు హాంఫట్..
యెస్ బ్యాంకులో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 2017 నుంచి యెస్ బ్యాంకు లావాదేవీలను ఆర్బీఐ పరిశీలిస్తున్నదని తెలిపారు. బ్యాంకులో పాలనాపరమైన లోపాలు, సమస్యలను ఆర్బీఐ గుర్తించిందన్నారు.
బలహీనతలు బయటపడ్డాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆస్తుల వర్గీకరణలోనూ తప్పులు జరిగాయని నిర్ధారణకు వచ్చిన ఆర్బీఐ.. బ్యాంకు యాజమాన్యాన్ని మార్చివేయాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ తరుణంలో రాణా కపూర్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు జరుపడం ప్రాదాన్యం సంతరించుకున్నది.
యస్ బ్యాంకులో పద్ధతులు, వ్యవహారాలు దిగజారిపోతున్నాయని స్వతంత్ర డైరెక్టర్ ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ బాంబు పేల్చారు. ఈ విషయమై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తన పదవికి ఈ ఏడాది జనవరి 10వ తేదీన రాజీనామా సమర్పించారు.
‘‘యస్ బ్యాంకు ఇండిపెండెంట్ డైరెక్టర్, ఆడిట్ కమిటీ చైర్మన్ పదవులతో పాటు, బోర్డుకు సంబంధించిన అన్ని కమిటీల్లో సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నా’’ అంటూ బ్యాంకు తాత్కాలిక చైర్మన్ బ్రహ్మ్‌దత్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో అగర్వాల్ పేర్కొన్నారు.
కార్పొరేట్ పాలనా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని, నిబంధనల అమలులో వైఫల్యం, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు.. ముఖ్యంగా బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్ గిల్, సీనియర్ గ్రూపు ప్రెసిడెంట్ రాజీవ్ ఉబోయ్, లీగల్ హెడ్ సంజయ్ నంబియార్ బ్యాంకును నిర్వహిస్తున్న తీరు పట్ల ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్ తన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యాంక్‌లో తీవ్రమైన క్విడ్‌ప్రోకో కొనసాగుతుందని స్వతంత్ర డైరెక్టర్ ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్ గడిచిన జనవరిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ సంస్థ నిర్దేశించిన పలు నిబంధనలు యస్ బ్యాంక్ ఉల్లంఘిస్తున్నదని ఉత్తమ్ ప్రకాశ్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఫిర్యాదు చేశారు.
బ్యాంకు సీఈఓపై గిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్ కోరారు. అనైతిక విధానాలతో బ్యాంకు బోర్డుపై గిల్ ఆధిపత్యం సాధించారనీ, క్విడ్ ప్రో కో లావాదేవీలతో బోర్డు సభ్యులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
‘‘యస్ బ్యాంకు, లక్షలాది డిపాజిటర్లు, వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ కీలక అం శాల పట్ల ఎప్పటికప్పుడు ఆందోళనలు వ్యక్తం చేశాను. సమస్యల పరిష్కారానికి శాయశక్తులా ప్రయత్నించా. నా రాజీనామాతో సంబంధం లేకుండా, బ్యాంకు కుదుటపడి, భాగస్వాములు, వాటాదారుల ప్రయోజనాలను మీ నాయకత్వంలో కాపాడుతుందని ఆశిస్తున్నాను’’ అని అగర్వాల్ పేర్కొన్నారు.
also read కరోనాతో కోలుకోలేని దెబ్బ: ఆర్థిక వ్యవస్థపై 25 లక్షల కోట్ల దాకా నష్టం ?!
ఇవే అంశాలపై సెబీ చైర్మన్ అజయ్ త్యాగికి జనవరి 9వ తేదీన ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్ ఓ లేఖ రాశారు. తక్షణమే సెబీ జోక్యం చేసుకోవాలని కోరారు. బ్యాంకు సీఈవో, ఎండీ రవనీత్ గిల్ గతేడాది అక్టోబర్ 31న బ్యాంకు 1.2 బిలియన్ పెట్టుబడుల ఆఫర్‌ను అందుకుందని మౌఖింగా చెప్పినట్టు లేఖలో పేర్కొన్నారు.
యస్ బ్యాంక్‌లో గత రెండేళ్లుగా సంక్షోభ చాయలు కొట్టొచ్చినట్టు కనిపించినా.. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పట్టించుకోలేదని స్పష్టమవు తున్నది. మొండి బాకీలు అమాంతం పెరగడంతో పాటుగా కార్పొరేట్ పరిపాలన అత్యంత లోపభూయిష్టంగా మారిందని సంకేతాలు వచ్చాయి.
మరోవైపు ఈ బ్యాంక్ పరపతి రోజు రోజుకూ పడిపోవడంతో ఏ విత్త సంస్థలు కూడా మూలధనం అందించడానికి దైర్యం చూపలేదు. గతేడాది నుంచి ఈ బ్యాంక్ మూలధన నిధుల కోసం అనేక విత్త సంస్థలను అభ్యర్థించింది. యస్ బ్యాంక్‌లో అనేక ప్రతికూల పరిణామాలు జరుగుతున్నా అటు కేంద్రం గానీ, ఇటు రెగ్యులేటరీ సంస్థలు గాని బ్యాంక్ పరిస్థితిపై దృష్టి సారించలేదు. ఫలితంగా ఖాతా దారుల కొంపముంచిందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.