వికారాబాద్‌: కర్ణాటక ప్రభుత్వంపై మాజీ సీఎం బీజేపీ నేత యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కర్ణాటక ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు.   జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమిలో గ్రూపు రాజకీయాలు తీవ్రమయ్యాయని త్వరలోనే కుమార స్వామి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు. 

బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో వేంచేసి యున్న భావిగి భద్రేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం కూటమి ప్రభుత్వం పడిపోవడంలో తమ పాత్ర ఏమీ ఉండదన్నారు. 

కర్ణాటకలో బీజేపీ బలం పుంజుకుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రెండు ఉపఎన్నికల ఫలితాల్లో అది రుజువు అయ్యిందన్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మల్లికార్జున ఖర్గేను సీఎంగా నియమిస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత ప్రకటించారని దాంతో ఆనాటి నుంచి ప్రభుత్వంపై విశ్వాసం పోయిందన్నారు. 

ఇకపోతే దేశ రాజకీయాల్లో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేజిక్ ఫిగర్ కంటే అత్యధిక స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో 20 నుంచి 22 లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మహబూబ్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాలను గెలిచితీరుతామని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు.