ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై ఈ రోజు రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. లోక్ సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వైసీపీ, టీడీపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేసి ఎన్డీయే పక్షానికి మద్దతు ఇచ్చాయి. బీఆర్ఎస్ మాత్రం బిల్లును వ్యతిరేకించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీలు రాష్ట్రంలో బద్ధ శత్రువులుగా ఉన్నప్పటికీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడంలో మాత్రం ఒకే విధానాన్ని పాటిస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో లేనప్పటికీ ఈ రెండు పార్టీలు పోటీ పడీ మరి ఈ పక్షానికి మద్దతు తెలుపుతున్నాయి. ఇందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ తాజా నిదర్శనం. లోక్ సభలో సునాయసంగానే ఈ బిల్లును ఆమోదింపజేసుకున్న ఎన్డీయేకు రాజ్యసభలో కొంత కష్టమే అయింది. వైసీపీ, టీడీపీ, బీజేడీ వంటి పార్టీలు బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో సులువుగా ఢిల్లీ ఆర్డినెన్స్‌ను రాజ్యసభలోనూ ఆమోదింపజేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు స్థానికంగా తీవ్ర విమర్శలు చేసుకున్నా బీజేపీ పట్ల సానుకూల వైఖరినే పాటించడం కొంత కాలంగా చూస్తూ వస్తున్నాం. అయితే, రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే ప్రతిసారీ ఎదురయ్యే పరీక్షకు ఏ పార్టీలు ఎటు వైపు మొగ్గిందా అనే ఆసక్తి కలగడం సహజం. తాజాగా, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలోనూ తెలుగు రాష్ట్రాల పార్టీలు ఎన్డీయే వెంట ఉన్నాయా? ఇండియా కూటమికి చేరువ య్యాయా? అనే చర్చ మొదలైంది.
తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ, టీడీపీలు ఇటు ఎన్డీయే, అటు ఇండియా ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉన్నాయి. అందుకే ఈ ఉత్కంఠ ఇంకొంత ఎక్కువగా ఉంటుంది. ఏపీలో బద్ధశత్రువులుగా ఉన్న వైసీపీ, టీడీపీలు రాజ్యసభలో మాత్రం ఎన్డీయేకు సానుకూలంగా ఢిల్లీ బిల్లుకు మద్దతు ఇస్తూ ఓటేశాయి. బీఆర్ఎస్ మాత్రం తాజాగా తన వైఖరి మార్చుకుంది. అంతకు ముందు వైసీపీ, టీడీపీ తరహాలోనే ఎన్డీయే కూటమికి బయటే ఉంటూ కేంద్రంలోని బీజేపీకి అవసరమైనప్పుడు ఆదుకుంటూ ఉండేది. కానీ, ఈ సారి ఎన్డీయేకు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఓటు వేసింది.
రాజ్యసభలో ఢిల్లీ బిల్లుకు మూజువాణి పద్ధతిలో సభ్యులు ఆమోదం తెలిపారు. కానీ, ఇందులో స్పష్టత ఉండదు. కేవలం యెస్, నో అనే అరుపులను విని స్పీకర్ తన విచక్షణ ఆధారంగా (సాధారణంగా సర్కారుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు అధికంగా ఉంటాయి) నిర్ణయం తీసుకుంటారు. ఏ పార్టీ దేనికి ఓటేసిందని తేల్చడం కూడా కష్టమే. ఢిల్లీ బిల్లుకు మూజువాణి పద్ధతిలో ఆమోదం తెలుపడాన్ని ప్రతిపక్షలు వ్యతిరేకించాయి. డివిజన్ పద్ధతిలో ఓటింగ్‌కు పట్టుబట్టాయి. దీంతో చైర్మన్ డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు.
బీఆర్ఎస్ బిల్లును వ్యతిరేకించడంపై ఎంపీ కేశవరావు వివరణ ఇచ్చారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు అప్రజాస్వామికమైనదని, దేశాన్ని నాశనం చేస్తుందనే దాన్ని వ్యతిరేకించినట్టు వివరించారు. ఈ బిల్లును వ్యతిరేకించినంత మాత్రానా తాము ఇండియా కూటమిలో భాగం అనుకోరాదని తెలిపారు. స్వల్ప మెజారిటీతో ఈ బిల్లు పాస్ అయిందని, 102 మంది వ్యతిరేకించగా.. 131 మంది ఆమోదం తెలిపారని చెప్పారు. ఈ బిల్లు పై రాజ్యసభలో మంచి చర్చ జరిగింది.
