సీఎం పదవిని తాను వదిలిపెట్టాలని అనుకున్నా.. ఆ పదవి తనను వదిలిపెట్టడం లేదే అని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనను తాను సీఎం క్యాండిడేట్‌గా చెప్పుకునే వ్యూహంలోనే గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. సచిన్ పైలట్ కొన్ని సంవత్సరాలుగా సీఎం సీటు కోసం కొట్లాడుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
జైపూర్: రాజస్తాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఉన్న సంగతి దేశమంతా తెలుసు. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య కోల్డ్ వార్ బద్ధలైన సంగతీ తెలుసు.. పార్టీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు వారిని సర్దిచెప్పి సయోధ్య చేకూర్చే ప్రయత్నాలూ తెలుసు. సీఎం సీటు కోసమే వీరి మధ్య పేచీ కొనసాగుతున్నది. సీఎం సీటు వదులుకోవడానికి గెహ్లాట్ సిద్ధంగా లేడు. కచ్చితంగా సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సిందేనని సచిన్ పైలట్ భీష్మించుకున్నాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్‌లో కాంగ్రెస్ మెజార్టీ సాధించినప్పటి నుంచి వీరి మధ్య ఈ వర్గ పోరు సాగుతున్నది. ఇలాంటి సందర్భంలో అశోక్ గెహ్లాట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను సీఎం సీటు వదిలిపెట్టాలని అనుకుంటూ ఉంటానని, కానీ, ఈ పదవే తనను వదిలిపెట్టడం లేదని అన్నారు. రాజస్తాన్‌లో కొత్త జిల్లాలో శంకుస్థాపన కోసం జైపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం పోస్టు వదిలిపెట్టాలని సడన్‌గా నా మదిలోకి వస్తుంది. అసలు నేను ఎందుకు వదిలిపెట్టాలో అనేది కూడా అర్థం కాదు. కానీ, ఈ పోస్టు మాత్రం నన్ను విడిచిపెట్టడం లేదు’ అని గెహ్లాట్ అన్నారు.
‘హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. ఈ పోస్టు వదిలిపెట్టాలని అనుకుంటున్నా అనే మాట చెప్పడానికి ధైర్యం కావాలి. కానీ, ఈ సీటు నన్ను వదిలిపెట్టడం లేదే’ అని మాట్లాడారు. సోనియా గాంధీ తనకు మూడు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఇచ్చారని, ఇదేమీ చిన్న విషయం కాదని వివరించారు.
Also Read: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు: రాజ్యసభలో ఆమోదం
ఎన్నికలు సమీపించిన వేళ అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సచిన్ పైలట్‌తో ఒక వైపు పోరు సాగుతుండగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తానే సీఎం క్యాండిడేట్ అని ప్రొజెక్ట్ చేసుకోవడంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ మరోసారి గెలిస్తే సీఎంగా బాధ్యతలు తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం తన వద్ద విజన్ 2030 ఉన్నదని చెప్పారు. ‘నేను విజన్ 2030 గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే నేను విద్య, ఆరోగ్యం, విద్యుచ్ఛక్తి, నీరు, రోడ్ల రంగాల్లో పని చేశాను. అందుకే నేను ఇంకా ముందుకు ఎందుకు వెళ్లవద్దు అనే ఆలోచనలు నన్ను చుట్టుముడుతుంటాయి’ అని గెహ్లాట్ వివరించారు.
ఇలా సీఎం పదవి తనను విడిచిపెట్టడం లేదని వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. ఓ మహిళ తనను మరోసారి సీఎంగా కొనసాగాలని కోరుకుందని ఆయన ఇటీవలే వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని వారాల క్రితమే పార్టీ అధినాయకత్వం వీరి మధ్య సయోధ్య కుదర్చిన సంగతి విధితమే.
