నిబంధనలు పాటించాలని ప్రజలకు చెప్పాల్సిన ప్రజా ప్రతినిధులే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రైలు ఎక్కాల్సిన వారు స్టేషన్ వద్ద దిగి.. ఫ్లాట్‌ఫాం మీదకు నడుచుకుంటూ వచ్చి ఎక్కుతారు. కానీ మధ్యప్రదేశ్‌ మంత్రి ఒకరు నేరుగా కారులోనే రైల్వే ఫ్లాట్ ఫాం మీదకు చేరుకున్నారు.

ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి యశోధర రాజే సింధియా గ్వాలియర్ రైల్వేస్టేషన్‌‌కు వెళ్లారు. సాధారణంగా రైల్వే ఫ్లాట్‌ఫాం పైకి ఎటువంటి వాహనాలను అనుమతించరు. కానీ మంత్రి మాత్రం తన కారు దిగకుండా ఫ్లాట్ ఫాంపైకి నేరుగా కారును తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు కూడా ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరించారు. పోలీసులు కూడా ఎస్కార్ట్‌గా ఉండి మరీ ఆమె కారుకు దారి చూపారు. ఈ తతంగాన్ని కొందరు వ్యక్తులు వీడియో తీసి నెట్లో పెట్టడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ నేతల ఆలోచన, ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈ సంఘటన ద్వారానే తెలుస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.