దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఎయిర్ ఫోర్స్ అధికారి 10 వేల అడుగుల ఎత్తులో నుంచి జీ20 జెండాతో స్కై డైవింగ్ చేశారు.
జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమయ్యింది. ప్రపంచ దేశాల నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాధినేతలు ఢిల్లీకి చేరుకోవడం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం (ఐఎఎఫ్) అధికారి రాజస్థాన్ లో జీ20 2023 జెండాతో స్కైడైవింగ్ చేస్తున్న కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘వసుధైవ కుటుంబకం - ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే నినాదంతో వింగ్ కమాండర్ గజానంద్ యాదవ 10,000 అడుగుల ఎత్తు నుంచి జీ20 జెండాతో స్కైడైవింగ్ చేశారు. ఈ ఏడాది మార్చిలో ఈ స్కైడైవింగ్ జరిగినప్పటికీ.. జీ20 సదస్సు నేపథ్యంలో దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 10 వేల అడగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన వింగ్ కమాండర్ యాదవ.. మాధ్ ఐలాండ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు.
కాగా.. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం కాంప్లెక్స్ లో జరిగే ఈ జీ20 సదస్సులో పాల్గొనేందుకు 40కి పైగా దేశాధినేతలు, సంస్థలు దేశ రాజధానికి చేరుకోనున్నాయి. నేటి రాత్రి 7 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ కు చేరుకోనున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ రేపు దేశ రాజధానికి వచ్చి, జీ20 సదస్సుకు హాజరుకానున్నారు.
జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దేశ రాజధానిలో బ్యాంకులు, ఆర్ధిక, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ విషయంలో ఆగస్ట్ 23వ తేదీనే ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు గాను కార్యాలయాలు, పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాలలు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించుకోవాలని సూచించింది.
