World Water Day: ప్రపంచ జ‌ల దినోత్సవం నాడు.. ప్రతి నీటి చుక్కను పొదుపు చేస్తామనే ప్రతిజ్ఞను మ‌నం పునరుద్ఘాటిద్దామ‌నీ, పౌరులకు నీటి సంరక్షణ మరియు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడానికి జల్ జీవన్ మిషన్ వంటి అనేక చర్యలను త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతోంద‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు.  

World Water Day: యావ‌త్ ప్ర‌పంచం నేడు (మార్చి 22) ప్ర‌పంచ జ‌ల దినోత్స‌వం (World Water Day) జ‌రుపుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్పందిస్తూ.. నీటి సంరక్షణ, పౌరులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు దేశం అనేక చర్యలు చేపడుతున్నదని తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. “ప్రపంచ నీటి దినోత్సవం నాడు, ప్రతి నీటి చుక్కను పొదుపు చేస్తామని మన ప్రతిజ్ఞను పునరుద్ఘాటిద్దాం. మన దేశం మన పౌరులకు నీటి సంరక్షణ మరియు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడానికి జల్ జీవన్ మిషన్ వంటి అనేక చర్యలను చేపడుతోంది అని అన్నారు. అలాగే, “గత కొన్ని సంవత్సరాలుగా, దేశంలోని అన్ని ప్రాంతాలలో వినూత్న ప్రయత్నాలతో నీటి సంరక్షణ ఒక సామూహిక ఉద్యమంగా మారడం ఆనందం క‌లిగిస్తోంద‌ని తెలిపారు. 

నీటిని పొదుపు చేసేందుకు కృషి చేస్తున్న వ్యక్తులు మరియు సంస్థలను నేను అభినందిస్తున్నాను అని ప్ర‌ధాని మోడీ తెలిపారు. జ‌ల వ‌న‌రుల సంర‌క్ష‌ణ కోసం త‌మ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని తెలిపారు.

Scroll to load tweet…

ప్ర‌పంచ జ‌ల దినోత్స‌వం.. 

నీటి ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్ర‌తియేట మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. నీరు ప్రతి జీవికి అత్యంత ముఖ్యమైన మూలకం. ప్రపంచ నీటి దినోత్సవం రోజు 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ గా.. అందరికీ త్రాగు నీరు మరియు పారిశుధ్యం సాధనకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ప్ర‌పంచ నీటి దినోత్స‌వం సంద‌ర్భంగా నీటివ‌న‌రుల‌కు సంబందించి ప్రజలు మరియు సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. సోషల్ మీడియా, టీవీ కార్య‌క్రమాల‌ ద్వారా సందేశాలను పంపుతాయి. 

ఈ ఏడాది థీమ్ ఇదే.. ! 

ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్ర‌పంచ నీటి దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. ఈ ఏడాది ‘Groundwater, making the invisible visible’ ( 'భూగర్భ జలాలు, కనిపించనివి కనిపించేలా చేయడం) థీమ్‌ను ఐరాస ప్రకటించింది. భూగర్భజలం అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం త్రాగదగిన నీటిలో అందించే కీలకమైన వనరు. భూగర్భ జలాలను అన్వేషించడం, రక్షించడం మరియు స్థిరంగా ఉపయోగించడం ఈ సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.

ఇది చ‌రిత్ర‌.. ! 

రియో డి జనీరోలో పర్యావరణం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ జరిగిన 1992లో ఈ అంతర్జాతీయ నీటి దినోత్సవం ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి. అదే సంవత్సరం, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో ప్రతి సంవత్సరం మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవంగా జ‌రుపుకోవాల‌ని ప్ర‌క‌ట‌న ఇచ్చింది ఐక్యరాజ్య స‌మితి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ జ‌ల దినోత్స‌వాన్ని 1993 నుండి జరుపుకుంటున్నారు. వేడుకలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

ఎందుకు అవ‌స‌రం..? 

నీటి సంబంధిత సమస్యల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వైవిధ్యం కోసం చర్య తీసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించడం ప్ర‌పంచ జ‌ల దినోత్స‌వం ఉద్దేశం. ఈ 2022లో, భూగర్భ జలాలపై దృష్టి కేంద్రీకరించబడింది. నీటి సంబంధిత సమస్యలలో నీటి కొరత, నీటి కాలుష్యం, సరిపడా నీటి సరఫరా, పారిశుధ్యం లోపించడం మరియు వాతావరణ మార్పుల ప్రభావాల గురించి ఈ రోజు పెద్ద ఎత్తున చ‌ర్చ‌జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప‌రిస్థితులు ఇలాగే ఉంటే.. మున్ముందు ఇప్ప‌టికీ ఎదుర్కొంటున్న త్రాగు నీరు స‌మ‌స్య‌లు మ‌రింత‌గా ముదురుతాయ‌ని అనేక అధ్య‌య‌నాలు హెచ్చ‌రించాయి. అందుకే నీటి సంర‌క్ష‌ణ‌, వ‌న‌రుల ల‌భ్య‌త‌పై అవ‌గాహ‌న కల్పించ‌డం అవ‌స‌రం.