బిహార్ మాజీ సీఎం, ఆర్డేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్..కుటుంబ సభ్యులకు పలు డిమాండ్లు చేశారు. తేజ్ ప్రతాప్ యాదవ్.. తన భార్య ఐశ్వర్యారాయ్ నుంచి విడాకులు తీసుకోవాలని భావించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పాట్నా కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే.. విడాకులకు కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో తేజ్.. అజ్ఞాతం లోకి వెళ్లిపోయాడు.

తేజ్ ప్రతాప్.. అజ్ఞాతంలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు కంగారుపడినప్పటికీ.. అతని సోదరుడు తేజస్వీ యాదవ్ పుట్టిన రోజుకి వస్తాడని అందరూ భావించారు. అయితే..  తన విడాకులకు కుటుంబసభ్యులు మద్దతు ఇచ్చే వరకు ఇంటికి రానని తేల్చిచెప్పాడు.

శుక్రవారం ఆయన పాట్నాలోని ఓ స్థానిక న్యూస్ చానల్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిస తేజ్.. వేడుకలకు తాను రావడం లేదని తేల్చి చెప్పాడు.

‘‘ నాకు నా భార్య మద్య ఏర్పడిన విభేదాలు తొలగిపోయేవి కావు. పెళ్లికి ముందే ఈ విషయం నా పేరెంట్స్ కి చెప్పాను. కానీ నా మాట వినకుండా పెళ్లి చేశారు. ఇప్పుడు కూడా నా మాట ఎవరూ వినడం లేదు. విడాకులకు ఒప్పుకుంటే కానీ.. నేను ఇంటికి రాను’’ అని తేల్చి చెప్పారు.