మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయడం సాధ్యపడదు.. ఎందుకంటే: బీజేపీ చీఫ్ నడ్డా
మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయడం సాధ్యం కాదని, న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే 2029 ఎన్నికల్లో అమలు అవుతుందని నేను హామీ ఇస్తాను అని వివరించారు.

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తేవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2029 ఎన్నికలకు వీటిని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. ‘ఈ రోజు బిల్లును పాస్ అయితే.. 2019లో చట్టసభల్లో రిజర్వేషన్ల కింద మహిళా ఎంపీలు ఉంటారని నేను మీకు హామీ ఇవ్వగలను’ అని వివరించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని వివరించారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు కొన్ని రాజ్యాంగపరమైన, చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని జేపీ నడ్డా అన్నారు. ‘మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ, ఏ సీట్లు ఇవ్వాలి? దీన్ని ఎవరు నిర్ణయించాలి? ఇవి అధికారపక్షం తీసుకునే నిర్ణయాలు కావు. ఈ నిర్ణయాలు క్వాసీ జుడీషియల్ బాడీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి బాడీని మేం నామినేట్ చేయాలి. అలాంటిది లేకుంటే, మేం వయానాడ్(రాహుల్ గాంధీ సీటు) సీటును మహిళలకు కేటాయిస్తే మమ్మల్ని అడ్డుకునేదెవరు? లేదా అమేఠీని మహిళలకు కేటాయిస్తామంటే మాకు అడ్డేది?’ అని వివరించారు.
జనగణన లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలు అసాధ్యం అని జేపీ నడ్డా అన్నారు. ప్రజా అభిప్రాయాలను వినాల్సి ఉంటుందని, సీట్లను ఎంపిక చేయాల్సి ఉంటుందని, ఎన్ని సీట్లో నిర్ణయించాల్ిస ఉంటుందని, ఆ తర్వాతే ముందడుగు వేయాల్సి ఉంటుందని తెలిపారు.
Also Read: కెనడాలో ఆ ఖలిస్తానీ టెర్రరిస్టు హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్
వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డమేమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పంచాయతీ, జిల్లా పంచాయతీ స్థాయిల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, వాటి కోసం జనాభా గణన చేయలేదని, మరి వీటికి ఎందుకు అవసరం అని ప్రశ్నించారు.
ఖర్గే వ్యాఖ్యలను నడ్డా ఖండించారు. రాజకీయ లబ్ది కోసమే వీటిని ముందుకు తెస్తే వెంటనే అమలు చేసేవాళ్లం కదా? కానీ, న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి కాబట్టే చేయడం లేదని నడ్డా వివరించారు. వారికి పాలన అంటే తెలియదు కాబట్టే ప్రతిపక్షంలో కూర్చున్నారని చెప్పారు.