రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం పోలీసులు బంపర్ ఆఫర్ తీసుకువచ్చారు. హైదరాబాద్ లో దిశ ఘటన, యూపీలో ఉన్నావ్ ఘటన తర్వాత... యూపీ రాష్ట్ర పోలీసులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలు ఒక్క ఫోన్ చేస్తే.. పోలీసులు వారు క్షేమంగా గమ్యస్థానం చేరుకునే వరకు ఎస్కార్ట్ గావ్యవహరించనున్నారు.

రాత్రి పదిగంటల నుంచి ఉదయం 6గంటల వరకుగల మధ్య సమయంలో ఎప్పుడైనా 112 నెంబర్ కి ఫోన్ చేస్తే సరిపోతుంది. ఆ నెంబర్ కి ఫోన్ చేయగానే పోలీసులు మీకు ఎస్కార్ట్ లాగా వ్యవహరిస్తారని ఆ రాష్ట్ర పోలీసులు చెప్పారు.

ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నావ్ ఘటన, హైదరాబాద్ లో దిశ ఘటన తర్వాత  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో మహిళల భద్రతను పెంచడానికి.. వారిని సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరుకునేలా చేయడంకోసం ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.

కాగా.. పోలీసు ఎస్కార్ట్ లో కచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ సంబంధిత అధికారులకు సూచించారు.