7 లక్షల విలువైన చీరలు దొంగిలించి పోలీసు స్టేషన్‌కు పంపిన మహిళల ముఠా.. ఎందుకో తెలుసా? (Video)
చెన్నైలోని ఓ చీరల షాపులో విజయవాడకు చెందిన ఓ మహిళల ముఠా దొంగతనం చేసింది. రూ.7 లక్షల విలువైన చీరలను దొంగిలించి సీసీటీవీలో చిక్కి.. ఇక పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న భయం వచ్చాక కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ చీరలను అన్నింటిని పోలీసు స్టేషన్‌కు పార్సిల్ చేశారు.
చెన్నై: తమిళనాడులోని శాస్త్రి నగర్ పోలీసు స్టేషన్‌కు బుధవారం ఓ పెద్ద పార్సిల్ వచ్చింది. తెరిచి చూస్తే ఖరీదైన చీరలు కనిపించాయి. దాదాపు అన్ని పట్టు చీరలే. దీపావళి సందర్భంగా ఎవరో శ్రేయోభిలాషులు తమకు గిఫ్ట్ పంపి ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ, అంతలోనే స్టేషన్‌లో ఫోన్ రింగ్ అయింది. అది ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి వచ్చిన కాల్. కొందరు మహిళలు కలిసి దొంగిలించిన చీరలే ఆ పార్సిల్‌లో వచ్చాయని చెప్పడంతో ఖంగుతిన్నారు.
బీసంట్ నగర్‌లోని ఓ చీరల షాపులో అక్టోబర్ 28వ తేదీన ఆ చీరలను సుమారు అరడజను మంది మహిళలు దొంగిలించారు. అయితే, ఈ దొంగతనం అంతా కూడా సీసీటీవీలో క్యాప్చర్ అయింది. ఓ ఇద్దరు మహిళలు సేల్స్ విమెన్‌తో సంభాషణలో ఉన్నారు. చీరల గురించి వివరాలు అడుగుతూ ఆమెను బిజీగా ఉంచారు. మరో ఇద్దరు మహిళలు పక్కపక్కనే నిలబడి ఎదుటి వైపు వారికి వెనుక జరిగేది కనిపించకుండా ఒక తెరలా నిలబడ్డారు. ఒక మహిళ ఆ చీరలను కట్టకట్టి చీర కిందుగా అప్పటికే కుట్టించుకన్న ఓ జేబు(!)లోకి తోశారు. మెల్లిగా ఆమె అడుగులు వేయగా.. ఆమెను కవర్ చేస్తూనే అడ్డుగా నిలబడిన ఇద్దరూ వెళ్లారు. ఆ తర్వాత షాపులో ఉన్న ముఠా మహిళలు మెళ్లిగా జారుకున్నారు. ఆ చీరలు రూ. 30 వేల నుంచి రూ. 70 వేల ఖరీదైనవిగా ఉన్నాయి. వారు దొంగిలించిన చీరల మొత్తం విలువ సుమారు రూ. 7 లక్షలుగా ఉన్నట్టు తెలిసింది.
Also Read : అభ్యర్థులకు లాస్ట్ మినిట్ ట్విస్టులు.. టికెట్లు ప్రకటించి మరీ మొండి చేయి
ఈ ఘటన మొత్తం షాపులో ఏర్పాటు చేసిన సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో లీక్ అయింది. సుమారు నాలుగు నిమిషాలపాటు ఉన్న వీడియోను చూసిన చెన్నై పోలీసులు మహిళా చోరుల కోసం గాలింపులు మొదలు పెట్టారు. కానీ, అందులో విజయవంతం కాలేదు. ఆ మహిళలు విజయవాడకు చెందినవారనే అనుమానంతో ఏపీ పోలీసులకు సమాచారం అందించి సహకరించాల్సిందిగా కోరారు.
ఏపీ పోలీసులు ఆ నిందితులను ట్రేస్ చేశారు. వెంటనే ఆ దొంగలు ఓ డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. దాని ప్రకారమే దొంగిలించిన చీరలను చెన్నై పోలీసులకు పంపించారు. ఈ కేసు నుంచి తప్పించుకోగలమని వారు అనుకున్నారు. కానీ, చట్టం నుంచి వారు తప్పించుకోలేరు. దీపావళి తర్వాత చెన్నై పోలీసులు విజయవాడకు వెళ్లి ఆ గ్యాంగ్‌ను అరెస్టు చేయనుంది. ఈ ముఠా మరికొన్ని షాపుల్లోనూ ఇలాంటి చోరీలకు పాల్పడ్డట్టు ఏపీ పోలీసులు ధ్రువీకరించారు.