తనకు ఎన్నో ఏళ్లుగా ఉపాధిని కల్పిస్తూ.. కష్టాల్లో తోడుగా ఉన్న యజమాని పట్ల విశ్వాసం చూపిన ఓ పనిమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇంటి యజమాని కొడుకు, కోడలు.. దక్షిణ ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఓ వృద్ధురాలు తన కొడుకు-కోడలితో కలిసి నివసించేది. అయితే కోడలితో అత్తకి ఎప్పుడూ పడేది కాదు. మద్ధతుగా ఉండాల్సిన కొడుకు కూడా కోడలికే వంత పడటంతో ఆ జంటను ఇంటి నుంచి పంపించేసింది ఆ మహిళ..

కొద్దిరోజుల తర్వాత కొడుకు తరచూ తల్లిని కలుస్తూ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు..  గత బుధవారం సాయంత్రం కోడలు మహిళ ఇంటి వద్ద గొడవకు దిగింది. వీరి వాదన తారా స్థాయికి చేరడంతో ఆ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళ కోడల్ని అడ్డుకునేందుకు యత్నించింది.

అంతే పనిమనిషివి మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ కొడుకు-కోడలు పనిమనిషిపై దాడికి పాల్పడ్డారు.. ఆమె దుస్తులు చించి.. అర్థనగ్నంగా రోడ్లపై పరుగులు పెట్టించారు.. పిడిగుద్దులు గుప్పిస్తూ చిత్రహింసలు పెట్టారు.. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కన్న తల్లిపైనా చేయి చేసుకున్నారు.. ఇంత జరుగుతున్నా స్థానికులు కనీసం వారిని అడ్డుకోలేదు. చివరకు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతుల కోసం గాలింపు చేపట్టారు.