మధ్యప్రదేశ్‌లో నర్మదా నదిపై ఓ మహిళ నడుస్తున్న వీడియో సంచలనంగా మారింది. ఆమెకు ఏవో అతీత శక్తులు ఉన్నాయనే చర్చ జరిగింది. కానీ, అలాంటిదేమీ లేదని, నదీ నీటి మట్టం చాలా తక్కువ ఉన్న చోటే ఆమె నడిచారని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.
భోపాల్: అద్భుతంగా, ఆశ్చర్యజనకంగా కనిపించేవి.. వాటి గుట్టు తెలిచే వరకే అతీతమైనదిగా ఉంటుంది. అసలు విషయం తెలిసిన తర్వాత.. సాధారణమైనదే కదా అని తేలిపోతుంది. మధ్యప్రదేశ్‌లో నర్మదా నదిపై ఓ మహిళ నడిచినట్టుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. చాలా మంది ఆ వీడియోకు పవిత్రను, అతీత శక్తిని ఆపాదించే పనిలో పడ్డారు. కానీ, అదంతా వట్టిమాటే అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నర్మదా నదిలో ఓ పెద్దావిడ సునాయసంగా నేలపై నడిచినట్టే నడిచి వెళ్లుతున్నట్టు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చర్చను లేపింది. ఆమెను చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. ఆ నదీ తీరం వద్దకు వచ్చి పరవశంలో మునిగిపోయారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే ముప్పు ఉండటంతో పోలీసులకూ సమాచారం వెళ్లింది.
ఆమె నర్మదా దేవి అవతారం అని కొందరు అన్నారు. ఆమె(జ్యోతిబాయి రఘువంశీ)ను పూజించడం కూడా మొదలు పెట్టారు. కానీ, ఈ వాదనలను స్వయంగా నదిలో నడిచినట్టుగా కనిపించిన పెద్దావిడ జ్యోతిబాయి రఘువంశీ కొట్టివేశారు. తనకు ఏ శక్తులూ లేవని, తాను నర్మదా దేవి అవతారం అంతకంటే కాదని స్పష్టం చేశారు. ఆమె కుటుంబం కూడా అదే విషయాన్ని చెప్పింది. ఏడాది క్రితం ఆమె కనిపించకుండా పోయిందని, ఆమె మానిసకంగానూ సరిగా లేదని తెలిపింది.
మరింతకి నదిపైనా ఎలా నడవగలిగిందనే ప్రశ్నను ఈ వివరణ చదివిన తర్వాత కూడా వేయడంలో తప్పేమీ లేదు. ఏ నదైనా.. నదీ నీటిమట్టం నది పొడవునా ఒకే స్థాయిలో ఉండవు. కొన్ని చోట్ల లోతు ఎక్కువగా మరికొన్ని చోట్ల లోతు తక్కువగా ఉండటం సహజం. కొన్ని చోట్ల నీటి ప్రవాహం తగ్గినప్పుడు నదిలో అక్కడక్కడ దాని అడుగు కూడా పైకి తేలి కనిపిస్తుంటుంది. అలాగే ఇక్కడ కూడా నది నీటి మట్టం చాలా తక్కువగా ఉన్న చోటే జ్యోతిబాయి రఘువంశీ అటూ ఇటూ తిరిగింది. అలాంటి చోట్లనే ఆమె తిరిగినా.. ఒడ్డుపై నుంచి చూసేవారికి ఆమె నీటి మట్టం లోతుగా ఉన్న చోటా సులువుగా నీటిపై నడుస్తున్నదనే భ్రమను కలిగిస్తున్నది.
